యాప్నగరం

రౌడీ బర్త్‌డే పార్టీ.. సినీ ఫక్కీలో 69 మంది అరెస్ట్!

పరారీలో ఉన్న నేరస్థుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన కరుడుగట్టిన నేరగాళ్లను పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

TNN 8 Feb 2018, 9:38 am
పరారీలో ఉన్న నేరస్థుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన కరుడుగట్టిన నేరగాళ్లను పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఓ రౌడీ జన్మదిన వేడుకలకు హాజరైన 69 మంది నేరగాళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నగర శివారులోని అంబుత్తూరు ప్రాంతం మంగళవారం రాత్రి పోలీసులు దాడితో హడలెత్తిపోయింది. అంబుత్తూరులోని ఓ లారీషెడ్‌లో సదరు రౌడీ జన్మదిన వేడుకలు చేసుకోగా దానికి నగరంలోని నేరగాళ్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీని గురించి సమాచారం ముందే తెలిసిన పోలీసులు నాటకీయంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు అక్కడ నుంచి తప్పించుకున్నారు.
Samayam Telugu chennai police gate crashes rowdys birthday bash arrest 69 history sheeters
రౌడీ బర్త్‌డే పార్టీ.. సినీ ఫక్కీలో 69 మంది అరెస్ట్!


వారి దగ్గర నుంచి 35 కత్తులు, 38 ద్విచక్రవాహనాలు, 8 కార్లు, 60 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలో చూళైమేడు ప్రాంతంలో పేరు మోసిన రౌడీ బిను. ఓ కేసులో పరారీలో ఉన్న అతడు మలైయంబాక్కంలోని ఓ లారీషెడ్‌లో పుట్టినరోజు వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశాడు. ఈ వేడుకల్లో పాల్గొనాలంటూ తన ముఠా సభ్యులు, నగరంలోని ఇతర రౌడీలు, నేరస్తులకు ఆహ్వానాలు పంపాడు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అందర్నీ ఒకేసారి పట్టుకోవాలనే ఉద్దేశంతో వ్యూహరచన చేసి, ప్రయివేట్ వాహనాల్లో వెళ్లాలని నిర్ణయించారు. మంగళవారం అర్ధరాత్రి అంబత్తూరు డీసీపీ సర్వేశ్‌రాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సహాయ కమిషనర్లు, ఇద్దరు సీఐలు, 21 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో సహా 50 వంది వరకు పోలీసులు పాల్గొన్నారు.

షెడ్‌ బయట వాహనాల ఆధారంగా రౌడీల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన పోలీసులు వారి వద్ద మారణాయుధాలు కూడా ఉండొచ్చని ముందే ఊహించారు. షెడ్‌లోకి తుపాకులతో ప్రవేశించిన పోలీసులను చూసి రౌడీలు దిగ్భ్రాంతికి గురై తప్పించుకోవడానికి ప్రయత్నించి, తలా దిక్కునకు పరుగులు పెట్టారు. ఈ సమయంలో వారిని తుపాకుల బెదిరించిన పోలీసులు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సమీపంలో పొదలు చాటున తలదాచుకున్న 29 మందిని పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన రౌడీల్లో మదురవాయల్‌కు చెందిన జెనిసన్‌, అతడి తమ్ముడు నిర్మల్‌, పుళియంతోపునకు చెందిన శరవణన్‌, పట్టాభిరామ్‌కు చెందిన మాట్టు శంకర్‌ తదితర 10 మంది రౌడీలు కీలకమైనవారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.