యాప్నగరం

మిత్రపక్షం, బీజేపీల మధ్య మాటల మంటలు!

ఒకరి అవసరం మరొకరికి ఉంది.. అయినా రెచ్చగొట్టుకుంటున్నారే..

TNN 31 Oct 2017, 2:49 pm
భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. నోట్ల రద్దుతో సహా మోడీ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా తప్పు పడుతోంది శివసేన. అవకాశం దొరికినప్పుడల్లా మోడీ ప్రభుత్వంపై శివసేన విమర్శల వాన కురిపిస్తోంది. ఇక శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో అయితే మోడీ ప్రభుత్వ తీరును తూర్పారపట్టడం మామూలైపోయింది.
Samayam Telugu cold war between shivsena and bjp
మిత్రపక్షం, బీజేపీల మధ్య మాటల మంటలు!


అదంతా చాలదన్నట్టుగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆకాశానికెత్తడం మొదలుపెట్టారు శివసేన నేతలు. రాహుల్ సమర్థుడు అని శివసేన ఎంపీ, సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడం బీజేపీని ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన విషయంలో స్పందించాడు. తమతో కలిసి ఉంటుందో, బయటకు వెళ్లిపోతుందో శివసేన ఇష్టం అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ సర్కారును ప్రతి విషయంలోనూ తప్పు పట్టడం మానాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు ఫడ్నవీస్. ఈ నేపథ్యంలో శివసేన కూడా ఘాటుగా స్పందిస్తోంది.

తమ అవసరం లేదు అని అనుకుంటే.. భారతీయ జనతా పార్టీ తమను వదిలేయవచ్చని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించడం ఆసక్తిదాయకంగా మారింది. బీజేపీని తాము పెద్దగా లెక్క చేయమన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధంగా కలహాల కాపురం సాగుతోంది.

అయితే శివసేన మద్దతు లేకపోతే మహారాష్ట్రలో ఫడ్నవీస్ సర్కారు కుప్పకూలుతుంది. ఎన్సీపీ గనుక మద్దతునిస్తే బీజేపీ నిలదొక్కుకోగలదు. అయితే ఎన్సీపీని బీజేపీ నమ్ముకోలేదు. ఈ నేపథ్యంలో శివసేనను కన్వీన్స్ చేసుకోవడమే కమలం పార్టీ ముందున్న మార్గం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.