యాప్నగరం

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు కాంగ్రెస్ ఓకే, అసదుద్దీన్ ఫైర్

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కాగా కొన్ని మార్పులు సూచించింది. ఈ బిల్లుపై మజ్లిస్ నేత ఓవైసీ మండిపడ్డారు.

TNN 28 Dec 2017, 7:13 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కారు గురువారం లోక్‌సభలో కీలకమైన ట్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్యే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పటికే తలాఖ్‌‌పై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. కానీ ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా చట్టమేదీ లేకపోవడంతో.. ఇప్పటికీ ఈ దురాచారం కొనసాగుతూనే ఉంది. మహిళల ఆత్మ గౌరవం కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇది చారిత్రాత్మకమైన రోజని ఆయన అభిప్రాయపడ్డారు.
Samayam Telugu congress back triple talaq bill owaisi fires on nda government
ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు కాంగ్రెస్ ఓకే, అసదుద్దీన్ ఫైర్


ఆలస్యంగా లేచిందనే కారణంతో ఓ ముస్లిం మహిళకు ఇటీవలే ఆమె భర్త తలాఖ్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఈ బిల్లు చట్టరూపం దాల్చడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. మహిళలకు సమానత్వం సిద్ధిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

ట్రిపుల్ తలాఖ్ బిల్లును మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు పాసయితే ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని వాదించారు. ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. సామాజిక చట్టాలు సమస్యలను పరిష్కరించలేవు. సమాజం సంస్కరించబడాలి. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం స్వార్థంగా ఆలోచిస్తోందని ఆయన విమర్శించారు.

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు టీడీపీ, కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు ప్రకటించాయి. కాగా.. బిల్లులో మార్పులు చేయాలని కాంగ్రెస్ సూచించింది. లింగ సమానత్వం కోసం ట్రిపుల్ తలాఖ్ రద్దు చేయడం మాకు ఎప్పుడూ సమ్మతమే. మహిళల హక్కులను పరిరక్షించేలా ప్రస్తుత బిల్లును మరింత బలోపేతం చేయాలి. అన్నివేళలా ముస్లిం మహిళలు, పిల్లల భద్రతను పార్లమెంట్ పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు మద్దతు పలుకుతున్నామని ఎన్సీపీ స్పష్టం చేసింది. కానీ వ్యక్తిగత, కుటుంబ విషయాలను నేరంగా మార్చొద్దని, దాని ప్రభావం కుటుంబం మొత్తంపై పడుతుందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. ముస్లిం ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ బిల్లు పట్ల ఇప్పటి వరకూ స్పందించలేదు. సమాజ్ వాదీ పార్టీ ట్రిపుల్ తలాఖ్ బిల్లును వ్యతిరేకించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.