యాప్నగరం

కాంగ్రెస్ ఆఖరి కోట కూడా కూలుతుంది: మోదీ

సిద్ధ రామయ్య ప్రభుత్వాన్ని చెల్లని రూాపాయంటూ ఎద్దేవా చేసిన మోదీ.. కర్ణాటక కూడా కాంగ్రెస్ పార్టీ చేజారుతుందని జోస్యం చెప్పారు.

Samayam Telugu 3 May 2018, 4:14 pm
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని సిద్ధ రామయ్య ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని మోదీ విమర్శించారు. కేంద్రం ఇచ్చి నిధులను ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆఖరి కోట అయిన కర్ణాటక కూడా హస్తం చేజారుతుందని ప్రధాని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు పొరుగున ఉన్న, తెలుగు సంతతి ఎక్కువగా ఉండే బళ్లారి వేదికగా మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Samayam Telugu modi bellary


కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలను దోచుకుందన్న మోదీ.. బళ్లారి ప్రజలు ఓటు హక్కు ద్వారా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి బయటకు సాగనంపాలని కోరారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఆయన సీదా-రూపియా (చెల్లని రూపాయి) గవర్నమెంట్ అంటూ ఎద్దేవా చేశారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ టిక్కెట్లను అమ్ముకుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ దళితులు, పేదలకు వ్యతిరేకంగా మారిందంటూ ప్రధాని ఘాటుగా విమర్శించారు. మల్లికార్జున ఖర్గేను సీఎం చేయకుండా దళితులను హస్తం పార్టీ మోసం చేసిందన్నారు. దళితులు, ముస్లింలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను విభజించింది. ఆ పార్టీ నిజలింగప్ప విషయంలో ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసంటూ మోదీ హస్తం పార్టీ తీరును ఎండగట్టారు. ముస్లిం అయిన అబ్దుల్ కలాం, దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌లను రాష్ట్రపతులుగా చేశామని మోదీ చెప్పారు. తద్వారా ఆ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

కర్ణాటక నీటి సమస్యను ఏడాదిలోగా తీర్చవచ్చని చెప్పిన మోదీ.. నీటి వనరులున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందన్నారు. దక్షిణాదికి బీజేపీ వ్యతిరేకమనే ఆరోపణలను ప్రధాని ఖండించారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతి చేశాం, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దక్షిణాదికి చెందిన వారే. ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని మోదీ గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.