యాప్నగరం

‘మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి బీజేపీ నీతిమాలిన చర్యలకు ప్రయత్నించింది’

మహారాష్ట్రలో శివసేన ఝలక్ ఇవ్వడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. అజిత్ పవార్‌ను తమవైపు లాగినా వారి ఆనందం మూణ్ణాల ముచ్చటగానే మిగిలిపోయింది.

Samayam Telugu 28 Nov 2019, 3:37 pm
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి ఆ పార్టీ సిగ్గుమాలిన చర్యలకు ప్రయత్నించిందని సోనియా దుయ్యబట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గురువారం సోనియా ప్రసంగిస్తూ... మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీపై కూడా విరుచుకుపడ్డారు. గవర్నర్ అనుసరించి విధానం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సూచనలతోనే గవర్నర్ కోశ్యారీ నడుచుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని సోనియా మండిపడ్డారు.
Samayam Telugu modi-shah


ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి విచ్ఛిన్నం కావడానికి బీజేపీ అహంకారం, అతి విశ్వాసమే కారణమని అన్నారు. మహావికాస్ అఘాడీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు.. కానీ, సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మోదీ-షా ప్రభుత్వం పూర్తిగా వెనక్కుతగ్గిందన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యలను అడ్డుకోవాలనే సంకల్పంతో మూడు పార్టీలు ఐక్యంగా పనిచేస్తాయని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మర్యాదపూర్వకంగా పతనమైందని, దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఎలా అధిగమించాలో మోదీ- షా ద్వయానికి స్పష్టత లేదని ఆరోపించారు.

దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతుందని, వృద్ధిరేటు మందగించి, నిరుద్యోగం పెరిగిపోయి, పెట్టుబడులు కూడా తగ్గిపోయాయని సోనియా ధ్వజమెత్తారు. రైతులు, వ్యాపారులు, చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగరేటు పడిపోయిందని, ఎగుమతులు మందగించాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని చెప్పారు.

సమస్యను పరిష్కరించడానికి బదులుగా మోడీ-షాలు గణాంకాలతో ప్రజలను మోసగించడంలో బిజీగా ఉన్నారని, వాస్తవాలను తెలియజేయడం లేదని సోనియా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ రంగం కొంతమంది మోదీ అనుకూల వ్యాపారవేత్తలకు అమ్ముడయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే ఆ సంస్థల్లో పనిచేసే వేలాది మంది కార్మికుల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో డిపాజిట్లపై సాధారణ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. రీజనల్ కాంప్రహెన్షివ్ ఎకనమిక్ పాలసీతోపాటు ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 రద్దుపై కూడా సోనియా విమర్శలు గుప్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.