యాప్నగరం

మోదీపై నీచ వ్యాఖ్యలు.. మణిశంకర్‌కు కాంగ్రెస్ షాక్

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.

TNN 7 Dec 2017, 9:48 pm
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్‌పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. మణిశంకర్‌ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రధాని స్థాయి వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దేశానికే అవమానమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా విమర్శలు వస్తుండటంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా మణిశంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి భాష ప్రయోగించడం సరికాదని, ప్రధానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్‌ అన్నారు.
Samayam Telugu congress suspends senior leader mani shankar aiyars primary party membership
మోదీపై నీచ వ్యాఖ్యలు.. మణిశంకర్‌కు కాంగ్రెస్ షాక్


‘కాంగ్రెస్‌కు మంచి సంప్రదాయం, వారసత్వం ఉంది. మణిశంకర్‌ అయ్యర్‌ ప్రధానిపై ప్రయోగించిన భాషను నేను అంగీకరించను. ఇందుకు ఆయన ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలి’ అని రాహుల్‌ అన్నారు. దీంతో మణిశంకర్‌ అయ్యర్ క్షమాపణలు చెప్పారు. తాను అలా విమర్శించి ఉండాల్సిందికాదని పేర్కొన్నారు. తనకు హిందీ సరిగా రాదని, అందుకే తప్పులు దొర్లాయని.. అందుకు మన్నించాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీని 2014 ఎన్నికల్లో చాయ్‌వాలాగా అభివర్ణించిన కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్.. తాజాగా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ‘నరేంద్ర మోదీ నీచమైన వ్యక్తి.. ఎలాంటి సభ్యత, నాగరికత లేని వ్యక్తి. మురికి రాజకీయాలు చేసే ఆయన గాంధీల రాజనీతిని శంకించాల్సిన అవసరం లేదు’ అని మణిశంకర్ అన్నారు.

అటు మణిశంకర్‌ వ్యాఖ్యలను మోదీ తిప్పికొట్టారు. గురువారం (డిసెంబర్ 7) సూరత్‌ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్‌, మణిశంకర్‌పై ధ్వజమెత్తారు. ఆయన తనను మాత్రమే అవమానించలేదని.. మొత్తం గుజరాత్‌నే అవమానించారని మోదీ పేర్కొన్నారు.

‘ఆయన నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేం తిరిగి అలా అవమానించలేం. మాకు వ్యవస్థ అంటూ ఒకటి ఉంది. నేను గుజరాత్‌కు సీఎంగా ఉన్నప్పుడు కూడా వారు ఇలాగే మాట్లాడారు. నన్ను జైల్లో పెట్టించాలని కూడా చూశారు. ఇలా మొఘల్‌ మనస్తత్వం ఉన్నవారు ప్రజలు మంచి దుస్తులు వేసుకున్నా కూడా వారిని అసహ్యించుకుంటారు. అలాంటి వారి వ్యాఖ్యలకు స్పందించకండి. వారికి బాలెట్‌ బాక్స్‌తోనే సమాధానం చెబుదాం’ అని మోదీ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.