యాప్నగరం

పరువునష్టం కేసు: కేజ్రీవాల్ కోర్టుకెళ్లాల్సిందే

పరువునష్టం కేసులో విచారణకు మార్చి 21న తమ ఎదుట హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని స్థానిక కోర్టు ఆదేశించింది.

TNN 18 Feb 2017, 6:32 pm
పరువునష్టం కేసులో విచారణకు మార్చి 21న తమ ఎదుట హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని స్థానిక కోర్టు ఆదేశించింది. శనివారం జరిగిన విచారణకు హాజరుపై మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించిన కోర్టు.. మార్చి 21న మాత్రం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Samayam Telugu defamation case arvind kejriwal asked to appear before court on march 21
పరువునష్టం కేసు: కేజ్రీవాల్ కోర్టుకెళ్లాల్సిందే


కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఎ) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని గతంలో కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసారు. కేజ్రీవాల్‌పై జైట్లీ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే డీడీసీఎ ఉపాధ్యక్షుడు చేతన్ చౌహన్ కూడా కేజ్రీపై పరువునష్టం దావా వేసారు. కేసును విచారణకు స్వీకరించిన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అభిలాష్ మల్రోత్రా ఫిబ్రవరి 18న కేజ్రీవాల్ కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు.

అయితే ప్రస్తుతం తాను బెంగళూరులో చికిత్స పొందుతున్నానని, ఫిబ్రవరి 22న తిరిగి ఢిల్లీ చేరుకుంటానని.. కాబట్టి శనివారం విచారణకు తనకు మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌ను అంగీకరించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విచారణను మార్చి 21కి వాయిదా వేశారు. అయితే ఆ రోజు కచ్చితంగా కోర్టు ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌ను ఆదేశించారు.

మరోవైపు డీడీసీఏపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10వేల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా, ప్రస్తుతం డీడీసీఏకు పరిపాలకుడిగా జస్టిస్ విక్రమజిత్ సేన్‌ను ఢిల్లీ హైకోర్టు నియమించిందని, అందువల్ల ఆజాద్‌పై వేసిన పరువునష్టం దావా చెల్లదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అయితే డీడీసీఎ ఉపాధ్యక్షుడిగా చౌహన్ ఉన్నప్పుడే ఈ పిటిషన్ దాఖలు చేసామని, కాబట్టి ఇది చెల్లకపోవడం ఉండదని డీడీసీఏ తరఫు న్యాయవాది సంగ్రామ్ పట్నాయక్ వాదించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.