యాప్నగరం

నిర్భయ కేసు దోషుల ఉరి ఫిబ్రవరి 1న

Delhi Court నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు దోషులను ఉరి తీయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Samayam Telugu 17 Jan 2020, 8:33 pm
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన నిర్భయ కేసు దోషుల ఉరితీతకు తేదీ ఖరారైంది. దోషుల ఉరితీతకు ఢిల్లీ కోర్టు తాజాగా మరోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని ఆదేశిస్తూ శుక్రవారం (జనవరి 17) సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌.. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం తిరస్కరించారు. దీంతో తాజా డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ తిహార్ జైలు అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Samayam Telugu victims


2012 డిసెంబర్‌ 16న అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీ నడి వీధిలో 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై ఆరుగురు నిందితులు కదులుతున్న బస్సులో అత్యంత దారుణంగా సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల శిక్ష అనుభవించి, విడుదలయ్యాడు. మరో దోషి రామ్‌ సింగ్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జులై 2017లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Also Read: భైంసా అలజడి: 70 మంది అరెస్టు.. ఐదో రోజూ 144 సెక్షన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 నాటి నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైలులో ఉరి తీయాల్సిందిగా పాటియాలా హౌస్‌ కోర్టు ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. దోషులు ముఖేష్‌ సింగ్‌ (30), పవన్‌ గుప్తా (23), వినయ్ శర్మ (24), అక్షయ్ ఠాకూర్‌కు మరణశిక్షను వెంటనే అమలు చేసేలా డెత్‌ వారెంట్‌ను జారీ చేయాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌‌ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. ముఖేశ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఒకవేళ ఆయన ఆ పిటిషన్‌ను తిరస్కరించినా 14 రోజుల గడువు విధించి నిందితులను ఉరి తీయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్భయ నిందితుల ఉరితీత అంశంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఢిల్లీ కోర్టు కొత్త తేదీని ఖరారు చేసింది.

మరోవైపు ఈ కేసులో మరో దోషి ఆయిన పవన్‌ గుప్తా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఘటన సమయంలో తాను జువైనల్‌ అని, దాని ఆధారంగానే విచారణ జరపాలని అభ్యర్థిస్తూ పిటిషన్‌ దాఖలు చేశాడు.

Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తూ భవనం పైనుంచి పడి యువతి మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.