యాప్నగరం

మరోసారి అదే విషాదం.. తోపుడు బండిపై ‘మానవత్వం’

అంబులెన్స్‌ సిబ్బంది చేసిన ఆలస్యం ఓ నిండు ప్రాణాన్ని గాల్లో కలిపితే.. వైద్య సిబ్బంది అమానవీయం కట్టుకున్న భార్య మృతదేహాన్ని తోపుడు బండిలో తీసుకెళ్లేలా చేసింది. ఈ విషాదం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

TNN 14 Mar 2018, 8:40 pm
అంబులెన్స్‌కు డబ్బు చెల్లించే స్తోమత లేని ఓ నిరుపేద అత్యంత దీన స్థితిలో తన భార్య మృతదేహాన్ని తన భుజంపై మోసుకుని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లడం కొన్ని నెలల కిందట అందరినీ కంటతడి పెట్టించింది. ఒడిశాలో జరిగిన ఈ ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్‌లో అలాంటి విషాదమే చోటు చేసుకుంది. అంబులెన్స్‌ సిబ్బంది చేసిన ఆలస్యం ఓ నిండు ప్రాణాన్ని గాల్లో కలిపితే.. వైద్య సిబ్బంది అమానవీయం కట్టుకున్న భార్య మృతదేహాన్ని తోపుడు బండిలో తీసుకెళ్లేలా చేసింది.
Samayam Telugu denied ambulance up man carries wifes body on handcart
మరోసారి అదే విషాదం.. తోపుడు బండిపై ‘మానవత్వం’


మెయిన్‌పురి జిల్లాకు చెందిన కన్హయ్య లాల్‌ (35) భార్య సోనీ తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కన్హయ్య అంబులెన్స్‌కు ఫోన్‌ చేశాడు. కానీ, గంటలు గడిచినా అంబులెన్స్‌ రాలేదు. చేసేదేం లేక కన్హయ్య తన భార్యను తోపుడు బండి పడుకోబెట్టి సుమారు 10 కి.మీ. వరకు తోసుకెళ్లి మెయిన్‌పురి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించిందని చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యాడు.

ఇంతటి విషాదంలో ఉన్న కన్హయ్యకు మరో చేదు అనుభవం ఎదురైంది. తన భార్య మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరగా.. ఆస్పత్రి వర్గాల నుంచి నిరాకరణ ఎదురైంది. దీంతో అతడు చేసేదేం లేక భార్య మృతదేహాన్ని గుడ్డలతో చుట్టి తోపుడు బండిపై తోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు.

ఆ దృశాన్ని చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. వైద్య సిబ్బంది తీరు పట్ల మండిపడ్డారు. మరోవైపు యూపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్‌ త్రివేది ఈ ఘటనపై స్పందిస్తూ.. 108 అంబులెన్స్‌ నంబర్‌కు ఎలాంటి ఫోన్‌ కాల్ రాలేదన్నారు. ‘కన్హయ్య నిరుపేద. ఫోన్‌ చేసేందుకు అతడి దగ్గర మొబైల్‌ కూడా లేదు. ఒకవేళ ఫోన్‌ చేసినా.. వేరొక నంబర్‌కి వెళ్లి ఉంటుంది’ అని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.