యాప్నగరం

రజినీ రాజకీయ సలహాదారుపై స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

మూడేళ్ల విరామం తర్వాత రాజకీయ పార్టీపై తలైవా విస్పష్ట ప్రకటన చేశారు. తాను సొంతంగా పార్టీపెట్టి ఎన్నికల్లో పోటీచేస్తానని రజినీ ప్రకటించడంతో తమిళ రాజకీయాల్లో మరో కొత్త శకం ఆరంభం కానుంది.

Samayam Telugu 7 Dec 2020, 3:51 pm
తన రాజకీయ అరంగేట్రంపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సన్నాహాలు జరుగుతుండగా డిసెంబరు చివరి లేదా జనవరి తొలివారంలో రాజకీయ పార్టీపై రజినీ ప్రకటన చేయనున్నారు. తాజాగా, తలైవా రాజకీయ ప్రవేశంపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని, అయితే రజనీకాంత్ పార్టీ పెట్టిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో మాట్లాడతానని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌ను పార్టీ ప్రకటించి, ఆయన సిద్ధాంతాలు, విధానాలు తెలుసుకుని అప్పుడు స్పందిస్తాను అంటూ వివరించారు.
Samayam Telugu ఎంకే స్టాలిన్
MK Stalin


అయితే, రజినీ రాజకీయ సలహాదారుపై మాత్రం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ సలహాదారుగా తమిళరువి మణియన్‌ను నియమించుకోవడంపై రజనీకాంత్ చింతిస్తున్నట్టు తెలిసిందని వ్యాఖ్యానించారు. తమిళరువిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నానా అని రజనీకాంత్ పునరాలోచనలో పడ్డారని అన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు, ఇతర కార్యాచరణ కోసం తమిళరువి మణియన్‌ను రజనీకాంత్ నియమించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీ ఏర్పాటు క్రమంలో తలైవా ప్రకటించిన మొట్టమొదటి నియామకం ఇదే.

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లోనూ రజినీ పార్టీ పోటీచేస్తుందని తమిళరువి శనివారం ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా తాము ఆధ్యాత్మికతతో కూడిన రాజకీయాలు చేస్తామని, ఎవ్వరినీ విమర్శించబోమని తమిళరువి పేర్కొన్నారు. ఇక, 2017లో రాజకీయాల్లో వస్తున్నట్టు రజినీకాంత్ ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే నేత, మాజీ సీఎం కరుణానిధి మరణంతో తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను రజినీ భర్తీచేస్తారని భావించారు. కానీ, మూడేళ్ల దాటినా రజినీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా, తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.