యాప్నగరం

Election Commission: ఓ వైపు జమిలీపై చర్చ.. మరోవైపు సాధారణ ఎన్నికలకు ఈసీ ప్రణాళికలు

జమిలీ ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కేంద్ర న్యాయ కమిషన్ సేకరించి క్రోడీకరిస్తోంది. జమిలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం సోమవారం ఓ లేఖ రాశారు.

Samayam Telugu 14 Aug 2018, 10:47 am
జమిలీ ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కేంద్ర న్యాయ కమిషన్ సేకరించి క్రోడీకరిస్తోంది. జమిలీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం సోమవారం ఓ లేఖ రాశారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల డబ్బు, సమయం, మానవవనరులు ఆదాఅవుతాయని, అభివృద్ధి ప్రక్రియకు ఎలాంటి అవరోధం ఉండదని షా తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్- మేలో జరబోయే లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, సిక్కిమ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రాల శాసనసభల ఎన్నికల నిర్వహణకు అదనంగా 17.4 లక్షల వీవీప్యాట్స్, 13.95 ఈవీఎంలు, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్ల తయారీకి ఆర్డర్ చేసింది. ఈవీఎంలను వచ్చే సెప్టెంబరు నాటికి, వీవీప్యాట్స్‌ను నవంబరు నాటికి అందజేయాలని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలను కోరింది.
Samayam Telugu కేంద్ర ఎన్నికల కమిషన్


ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే 34 లక్షల ఈవీఎంలు, 26 లక్షల కంట్రోల్ యూనిట్లు, 27 లక్షల వీవీప్యాట్‌లు అవసరమవుతాయని ఎన్నికల కమిషన్ వర్గాల పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈవీఎంలు, వీవీప్యాట్స్ కొరతపై దృష్టి సారించి, అదనంగా కొత్త యంత్రాలను ఆర్డర్ చేశామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. లోక్‌సభతోపాటు రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలతో సహా సంబంధిత చట్టాలలో అవసరమైన మార్పుల తర్వాతే సాధ్యమని రావత్ పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త యంత్రాల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వలేదని అన్నారు. న్యాయపరమైన మార్పులు చేసిన తర్వాతే దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని రావత్ వ్యాఖ్యానించారు.

2019 సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే ఉంది. ఈ తరుణంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేస్తే దీనికి తగినన్ని ఈవీఎంలు, వీవీప్యాట్స్ సేకరించడం కష్టమవుతుంది. అదే కోణంలోనూ ఈసీ కొత్తవాటిని సేకరిస్తోన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వచ్చే సాధారణ ఎన్నికల్లోగా జమిలీ ప్రతిపాదన అమలు సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన జమిలీ ప్రతిపాదనకు కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపగా, మరి కొన్ని వ్యతిరేకించాయి. మరోవైపు లా కమిషన్ కూడా రాజ్యాంగపరమైన విధివిధానాలను రూపొందించే పనిలో ఉంది. లా కమిషన్ తుది నివేదిక ఇవ్వగానే భేటీ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు వాయిదా వేసి వచ్చే లోక్‌సభ, మిగతా ఐదు రాష్ట్రాలతో కలిపి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే భావనలోనూ కేంద్రం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.