యాప్నగరం

వర్షాలు పడలేదని అధికారులపై రైతుల ఫిర్యాదు

రైతుల నుంచి భారత వాతావరణ శాఖ అధికారులకి పెద్ద చిక్కొచ్చిపడింది. వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా...

Mumbai Mirror 14 Jul 2017, 9:35 pm
మహారాష్ట్రలోని మరాఠవాడకి చెందిన రైతుల నుంచి అక్కడి స్థానిక భారత వాతావరణ శాఖ అధికారులకి పెద్ద చిక్కొచ్చిపడింది. భారత వాతావరణ శాఖ అధికారులు విత్తనాలు, ఎరువుల తయారీదారులతో కుమ్మక్కై రుతుపవనాలపై తప్పుడు నివేదికలు అందిస్తున్నారని పేర్కొంటూ మరాఠవాడ రైతులు ఇవాళ మహారాష్ట్ర పోలీసులకి ఫిర్యాదు చేశారు.
Samayam Telugu farmers filed a police complaint against the india met department
వర్షాలు పడలేదని అధికారులపై రైతుల ఫిర్యాదు


బీడ్ జిల్లా మజల్‌గావ్ రెవిన్యూ పరిధిలోని డిండ్రిడ్ పోలీసు స్టేషన్‌కి వెళ్లిన రైతులు.. పూణె, కొలబ శాఖలకి చెందిన భారత వాతావరణ శాఖ అధికారులపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. అక్కడి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన సమాచారం మేరకే తమ ప్రాంత రైతులు విత్తనాలు వేశామని.. కానీ వర్షాలు లేకపోవడంతో లక్షల రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. విత్తనాలు, ఎరువుల తయారీదారులతో కమ్మక్కై, తమకి నష్టం కలగడానికి కారకులైన భారత వాతావరణ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

జూన్-జూలై నెలల్లో వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చేసిన ప్రకటన మేరకే తాము విత్తనాలు వేశాం. కానీ కొద్దిపాటి జల్లులు తప్ప అసలు వర్షాలే పడలేదు. దీంతో విత్తనాలు నాటి వర్షాల కోసం వేచిచూసిన రైతులు అంతా లక్షల్లో నష్టపోయారని గంగబిషన్ థావరే అనే రైతు తమ ప్రాంత రైతుల ఆవేదనని మీడియాకు తెలిపారు. విత్తనాలు, ఎరువులు, కూలీల వేతనాలు.. ఇలా తాము పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయ్యిందని పోలీసులకి మొరపెట్టుకున్నారు రైతులు.

అంతేకాకుండా ఈ విషయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని తమకి న్యాయం చేయాలి అని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసినట్టు థావరే తెలిపారు. రైతుల నుంచి అందిన ఫిర్యాదుపై తగిన రీతిలో స్పందిస్తామని మజల్ గావ్ పోలీసులు చెబుతున్నారు. తమకి అందినటువంటి ఈ అరుదైన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అలాగే భారత వాతావరణ శాఖ అధికారులు ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.