యాప్నగరం

Karnataka Polling: కర్ణాటకలో పోలింగ్.. క్యూలో నిల్చొని ఓటేసిన సినీ, వ్యాపార ప్రముఖులు

Karnataka Polling: కర్ణాటక ఎన్నికల పోలింగ్‌లో సాాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఓటేసేందుకు ఆసక్తి చూపారు. సాధారణ ప్రజల్లా క్యూలైన్‌లో నిల్చొని ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 10 May 2023, 10:42 am

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
  • ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
  • వివాదాస్పదంగా మారిన ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Karnataka Polling: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు భారీగా క్యూ కట్టారు. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఓటేసేందుకు ఆసక్తి చూపారు. ఉదయం నుంచే ప్రముఖులు పోలింగ్ సెంటర్లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖులు సూచిస్తున్నారు.
సినీ నటుడు ప్రకాష్ రాజ్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి, సుధా మూర్తి, సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప, కన్నడ నటి అమూల్య, ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, కన్నడ నటులు గణేష్, రమేష్ అర్వింద్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కర్ణాటక ఎన్నికల్లో ఓటేశారు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సాధారణ వ్యక్తిలా క్యూలో నిల్చొని ఓటేశారు.

ఓటేసిన అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటేయాలని, కర్ణాటక అందంగా ఉండాలని వ్యాఖ్యానించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పరోక్షంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రకాష్ రాజ్ పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.

ఇక ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'యువకులతో కూర్చోని ఓటు ఎందుకు ముఖ్యమని చెప్పే బాధ్యతను పెద్దలు తీసుకోవాలని, తన తల్లిదండ్రులు కూడా అదే చేశారని వ్యాఖ్యానించారు. ఇక సుధామూర్తి మాట్లాడుతూ.. ఓటు వేయమని తాను ఎప్పుడూ యువతకు చెబుతానని, అప్పుడే నాయకులను ప్రశ్నించే శక్తి ఉంటుందన్నారు. ఓటు వేయకపోతే ప్రశ్నించే శక్తి ఉండదని యువ ఓటర్లకు సూచించారు. పెద్ద వయస్సు గల తాము ఉదయం 6 గంటలకు నిద్రలేచి ఓటు వేయడానికి వచ్చామని, తమను చూసి నేర్చుకోవాలని సుధా మూర్తి సూచించారు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో పవిత్రమైన భాగమని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రకాశ్ రాజ్ బెంగళూరులో, నిర్మలా సీతారామన్ విజయనగరలో, బసవరాజు బొమ్మై హుబ్లీలో, యడ్యూరప్ప శికారిపురలో ఓటేశారు. పోలింగ్ కోసం కర్ణాటకవ్యాప్తంగా 58, 545 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. కర్ణాటక ఓటర్లు మొత్తం 5.31 కోట్ల మంది ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా.. సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారి ఓట్ ఫ్రం హోం విధానాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నెల 13న కౌంటింగ్ జరగనుంది.
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.