యాప్నగరం

దేశంలో తొలి కరోనా మరణం.. హైదరాబాద్‌లో చికిత్స పొందిన ఆ వృద్ధుడికి కోవిడ్

దేశంలో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. ఇటీవల మరణించిన 76 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Samayam Telugu 13 Mar 2020, 1:16 am
భారత్‌లో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. కోవిడ్-19 లక్షణాలతో మంగళవారం మరణించిన వృద్ధుడికి కరోనా సోకినట్లు కర్ణాటక ఆరోగ్య విభాగం ప్రకటించింది. కలబుర్గికి చెందిన 76 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా లక్షణాలతో చనిపోయిన సంగతి తెలిసిందే. కలబుర్గికి చెందిన ఆ వృద్ధుడు ఫిబ్రవరి 29న సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించగా.. అతడిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని అధికారులు తెలిపారు. మార్చి 5న ఆస్తమా, బీపీతో అతడు కలబుర్గిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు సమాచారం.
Samayam Telugu corona death


హాస్పిటల్ సిబ్బంది అతడి శాంపిళ్లను కరోనా పరీక్షలకు పంపారని.. మూడు రోజుల తర్వాత అతణ్ని హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు షిప్ట్ చేశారని తెలుస్తోంది. అదే రోజు అతణ్ని ఇంటికి తీసుకెళ్లగా.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చనిపోయాడని సమాచారం. హాస్పిటల్ వర్గాలు కరోనా లక్షణాలున్న పేషెంట్‌ను బయటకు వెళ్లడానికి ఎలా అనుమతించాయి అనేది తెలియాల్సి ఉంది.

Read Also: కరోనా కట్టడిలో తైవాన్ అద్భుత పనితీరు

ఈ విషయమై విచారణ జరపడం కోసం కర్ణాటకకు చెందిన ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుంది. కరోనా పేషెంట్ ఎక్కడ అడ్మిట్ అయ్యారు. అతడితో ఎవరు కాంటాక్ట్‌‌లో ఉన్నారు. అతణ్ని ఎలా బయటకు పంపారు అనే విషయాలను ఈ బృందం ఆరా తీస్తోంది. కరోనా మరణానికి హైదరాబాద్ నగరంతో సంబంధం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లను అప్రమత్తం చేసింది.

Read Also: ట్రంప్‌తో కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చిన అధికారికి కరోనా

మరణించిన వృద్ధుడితో 43 మంది కాంటాక్ట్‌లో ఉన్నారని గుర్తించారు. వారందర్నీ ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంచుతామని కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్‌లో ఇప్పటి వరకూ 75 మందికి కరోనా సోకగా.. ప్రపంచ వ్యాప్తంగా 1.24 లక్షల మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. 4700 మందికిపైగా కోవిడ్ కారణంగా చనిపోయారు.

Read Also: తిరుమలేశుడిపై కరోనా ఎఫెక్ట్.. టీటీడీ చరిత్రలో తొలిసారిగా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.