యాప్నగరం

Zika Virus: జికా వైరస్ కలకలం... కర్ణాటకలో ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్

కర్ణాటకలో జికా వైరస్ (Zika Virus) కేసు నమోదైంది. ఐదేళ్ల చిన్నారికి వైరస్ ఉన్నట్టు తేలింది. గత కొన్ని రోజులుగా పాప అస్వస్థతకు గురి కావడంతో.. వైద్యులు టెస్ట్‌లు నిర్వహించారు. ఈ సందర్భంలో పాపకు జికా వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా జికా వైరస్ తొలిసారి ఉగాండాలో వెలుగు చూసింది. మన దేశంలో ఎక్కువగా కేరళలో ఈ కేసులు నమోదయ్యాయి.

Authored byAndaluri Veni | Samayam Telugu 13 Dec 2022, 11:15 am

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో తొలి జికా వైరస్ కేసు
  • ఐదేళ్ల పాపకు జికా వైరస్
  • ఉగాండాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన వైరస్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Zika Virus
కర్ణాటకలో జికా వైరస్ (Zika Virus) కలకలం రేగింది. రాష్ట్రంలో ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ ఉన్నట్టు తేలింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్టు తెలిసింది. కొన్ని రోజులుగా చిన్నారి అనారోగ్యానికి గురైంది. డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో టెస్ట్‌లు చేయించారు.
డాక్టర్లు పాప సీరమ్ శాంపిల్స్‌తో పాటు మరో ఇద్దరివి సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ పరీక్షల్లో పాపకు జికా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇద్దరికి నెగిటివ్ అనే తేలింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సుధాకర్ అన్నారు. "రాష్ట్రంలో ఇది మొదటి కేసు. ప్రభుత్వం పరిస్థితిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. దీనిని నిర్వహించడానికి మా డిపార్ట్‌మెంట్ సిద్ధంగా ఉంది." అని ఆయన అన్నారు.

అలాగే దీనికి సంబంధించి అందరికి హెచ్చరికలు జారీ చేశామని మంత్రి సుధాకర్ అన్నారు. ఏదైనా ఆస్పత్రుల్లో అనుమానాస్పద ఇన్‌ఫెక్షన్ కేసులు కనిపిస్తే జికా వైరస్ పరీక్షల కోసం నమూనాలను పంపించాలని రాయచూర్, పొరుగు జిల్లాల్లోని నిఘా (ఆరోగ్య శాఖ) అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చామన్నారు. కాగా కొన్ని నెలల క్రితం కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా కర్ణాకటలో వెలుగు చూడడం ఆందోళనకరంగా మారింది.

జికా వైరస్.. .(Zika Virus)
ఈ వైరస్ ఏడెస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ఇన్‌ఫెక్షన్లను కూడా కలిగిస్తోంది. ఈ వైరస్‌ను మొదటిసారిగా 1947లో ఉగాండాలో గుర్తించారు. 1952లో ఉగాండా, టాంజానియాల్లో మనుషులకు జికా వైరస్‌ సోకింది. తర్వాత 2007లో, 2013లోనూ పలు దేశాల్లో కొన్ని కేసులు బయటపడ్డాయి. 2015, 2016లో జికా వైరస్‌ మహమ్మారి గా మారింది.

లక్షణాలు.. (zika virus symptoms)
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసిన వివరాలు ప్రకారం ఏడెస్ దోమలు సాధారణంగా పగటిపూట కుడతాయి. మామూలుగా ఈ వ్యాధి ప్రమాదకరం కాదు. కానీ గర్భిణీలకు, గర్భంలోని శిశువులకు ఇది చాలా ప్రమాదకరం. ఇలా కొందరిలో సీరియస్ అయి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాల నొప్పులు లాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

మన దేశంలో ఈ కేసులు ఎక్కువగా కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా జికా వైరస్ కొంతమందికి సోకింది. ఈ వైరస్ నియంత్రణ కోసం కేరళ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.