యాప్నగరం

బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి నేత, మాజీ సీఎం మాధవ్‌సిన్హా సోలంకి అస్తమయం

ఆర్ధికంగా వెనుబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించిన తొలి సీఎంగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మాధవ్‌సిన్హా సోలంకి అస్తమయం చెందారు.

Samayam Telugu 9 Jan 2021, 10:31 am
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మాధవసిన్హా సోలంకి (94) శనివారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆయన తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సోలంకీ పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సోలంకి 1980 దశకంలో క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిమ్ ఫార్ములా (కేహెచ్ఏఎం)తో గుజరాత్ సీఎంగా ఎన్నికయ్యారు. అంతకు ముందు 1976లో కొంత కాలం సీఎంగా ఉన్నారు. తర్వాత 1981లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు.
Samayam Telugu మాధవ్‌సిన్హా సోలంకీ
Madhavsinh Solanki


1985లో మాధవసిన్హా సోలంకి రాజీనామా చేసినా, కాంగ్రెస్ తిరిగి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మొత్తం 182 స్థానాలకు గానూ 149 సీట్లను కాంగ్రెస్ గెలుపొందింది. రెండుసార్లు గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మాధవ్‌సిన్హా సోలంకి 1991 జూన్ నుంచి 1992 మార్చి వరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. మాధవ్‌సిన్హా సోలంకి తనయుడు భరత్ సొలంకీ కూడా గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు.

సోలంకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. ‘గుజరాత్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న మాధవ్‌సిన్హా సోలంకి జీ బలీయమైన నేత. సమాజానికి ఆయన చేసిన గొప్ప సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. ఆయన మరణం నన్ను కలిచివేసింది.. సోలంకి కుమారుడు భరత్‌తో మాట్లాడి సంతాపం తెలిపారు. ఓం శాంతి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

‘రాజకీయాలను పక్కనబెడితే మాధవ్ సిన్హా సోలంకి పుస్తకాలు చదవడంలో ఎక్కువగా ఆనందించారు.. సంస్కృతి పట్ల మక్కువ... నేను అతనిని కలిసినప్పుడు లేదా అతనితో మాట్లాడినప్పుడల్లా పుస్తకాల గురించి చర్చించేవాళ్లం..ఆయన ఇటీవల చదివిన కొత్త పుస్తకం గురించి నాకు చెప్పారు. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను నేను ఎల్లప్పుడూ ఆదరిస్తాను’అని పేర్కొన్నారు.

‘మాధవ్‌సిన్హా సోలంకి మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. దేవుడు తన ఆత్మకు శాంతిని చేకూర్చాలి.. ఆయన తన చర్యల ద్వారా, పనుల ద్వారా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన చోటు సంపాదించారు’ అని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చవ్డా అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.