యాప్నగరం

ఆ మాజీ సీఎం బీజేపీలో చేరేది రేపే!

భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో మాజీ సీఎం కమల దళంలో చేరనున్నారు.

TNN 21 Mar 2017, 2:33 pm
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన కమల దళంలో చేరనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన అమిత్ షాను కలిసినట్లు సమాచారం. ఆయన కాషాయ పార్టీలో చేరిన వెంటనే నంజన్‌గుడ్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి వి.శ్రీనివాస ప్రసాద్ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. వాస్తవానికి ఎస్ఎం కృష్ణ గత వారమే బీజేపీలో చేరాల్సింది. కానీ ఆయన సోదరి మరణంతో బెంగళూరు రావడంతో ఈ కార్యక్రమం బుధవారానికి వాయిదా పడింది.
Samayam Telugu former karnataka cm sm krishna will join bjp tomorrow in delhi in presence of party chief amitshah
ఆ మాజీ సీఎం బీజేపీలో చేరేది రేపే!


ఎస్ఎం కృష్ణను తమిళనాడు గవర్నర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దక్షిణాదిన కీలక రాష్ట్రమైన తమిళనాడుకు ఇప్పటి దాకా పూర్తిస్థాయి గవర్నర్ లేకపోవడంతో.. మహారాష్ట్ర గవర్నర్ అయిన సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ రాష్ట్రానికి ఇంఛార్జ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో విజయం సాధించి ఊపుమీదున్న బీజేపీ కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ మాజీ సీఎం చేరికతో ఒక్కలిగ సామాజిక వర్గం తమ వైపు మొగ్గు చూపుతుందని, వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఇది తమకు లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగానూ పని చేసిన 84 ఏళ్ల ఎస్ఎం కృష్ణ... ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎస్ఎం కృష్ణను బీజేపీలో చేర్చుకోవడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట మసకబారుతుందని సమాజ్ పరివర్తన సంస్థ వ్యవస్థాపకులు ఎస్ఆర్ హిరేమఠ్ హెచ్చరించారు. ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్దార్థ చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకాలో 180 ఎకరాల అటవీభూమిని ఆక్రమించుకున్నారని హిరేమఠ్ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.