యాప్నగరం

జాతీయ సగటును మించిన యాక్టివ్ కేసులు.. కేరళలో అక్టోబరు 31 వరకు 144 సెక్షన్

కరోనా వైరస్ మొదలైన తొలినాళ్లలో మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కొన్న కేరళ మోడల్.. తర్వాత మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Samayam Telugu 2 Oct 2020, 2:02 pm
కేరళలో కరోనా వైరస్ మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కచోట ఐదుగురు మించి గుమిగూడటాన్ని నిషేధిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 144ను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా గురువారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మంది గుమిగూడటం వల్ల కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఆదేశాలు అక్టోబరు 3 శనివారం ఉదయం 9 గంటల నుంచి అమల్లోకి వస్తాయనీ.. ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Samayam Telugu కేరళలో కరోనా వైరస్


క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి కరోనా వైరస్ కట్టడికి కలెక్టర్లు సెక్షన్- 144 కింద సంబంధిత నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా, దేశంలోనే అత్యధికంగా యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో కేరళ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత కేరళలోనే యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయి. మొత్తం 2 లక్షల మంది కరోనా బారినపడగా.. వీరిలో 1,31,048 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 72 వేల మందికిపైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, కేరళలో మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది.

దేశంలోని మొత్తం కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15.42 శాతంగా ఉంది. ఇందులో కేరళ వాటా 33 శాతం. ఆగస్టు 1 నాటికి జాతీయ సగటు 33 శాతం ఉండగా.. అప్పటి నుంచి యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో కేరళలో మాత్రం పెరుగుతున్నాయి. అలాగే, పాజిటివ్ రేటు కూడా 12 శాతంగా ఉంది. గడచిన రెండు మూడు వారాలుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, టెస్టింగ్ సంఖ్య కూడా స్థిరంగా లేదు. ఉదాహరణకు బుధవారం 63,685 పరీక్షలు చేయగా.. గురువారం 57,775, సోమవారం 33,585 పరీక్షలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.