యాప్నగరం

Delhi: ఢిల్లీ శరణాలయంలో దారుణం.. బాలికల మర్మాంగాల్లో కారం పెట్టి..

శరణాలయంలో ఆశ్రయం పొందుతోన్న బాలికల పట్ల అక్కడి సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన మరో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Samayam Telugu 30 Dec 2018, 12:11 pm
శరణాలయంలో ఆశ్రయం పొందుతోన్న బాలికల పట్ల అక్కడి సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన మరో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అమ్మలా ఆదరించాల్సిన మహిళా సిబ్బందే ఆడపిల్లలను తీవ్ర హింసలకు గురిచేశారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఓ శరణాలయంలో జరుగుతోన్న అకృత్యాలు మహిళా కమిషన్ తనిఖీల్లో బయటపడ్డాయి. శిక్షల పేరిట బాలికల జననావయవాల్లో కారం పెడుతూ అమానుషంగా అక్కడ మహిళలు వ్యవహరిస్తున్నారు. తమకు సిబ్బంది నిత్యం నరకం చూపిస్తున్నారని బాలికలు డీసీడబ్ల్యూ ఎదుట పూసగుచ్చినట్టు వివరించారు. కౌమారంలో ఉన్న బాలికలతో పాత్రలు కడిగించడం, దుస్తులు ఉతికించడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం, వంట పనులు లాంటివి చేయిస్తున్నారు.
Samayam Telugu delhi


అలా కాదని ఎదురుతిరిగిన వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ శిక్షలకు గురిచేసి దారికి తెచ్చుకుంటున్నట్లు మహిళ కమిషన్ తెలిపింది. వారు చెప్పిన మాట వినకపోతే తమ జననావయావాల్లో కారం పెడుతున్నారని, బలవంతంగా తమతో పనులు చేయిస్తున్నారని డీసీడబ్ల్యూ ఎదుట బాలికలు తమ ఆవేదన వెలిబుచ్చారు. తమను స్కేళ్లతో కొడుతుంటారని, సెలవుల్లోనూ ఇంటి వెళ్లనీయడం లేదని వాపోయారు. ఈ శరణాలయంలో 6 నుంచి 15 ఏళ్లలోపు బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. సిబ్బంది కొరతతో పనులన్నీ వీరితోనే చేయిస్తున్నారు. మొత్తం 22మంది బాలికలు, సిబ్బందికి కలిసి ఒక్క వంటమనిషే ఉన్నట్లు డీసీడబ్ల్యూ తెలిపింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ఈ ఆశ్రయానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందజేయడంతో అధికారుల అక్కడికి చేరుకుని బాలికల వాంగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు నలుగురు మహిళా సిబ్బందిని అరెస్టు చేశారు.

నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు, ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను కొత్తవారికి అప్పగించాలని, అక్కడ ఆశ్రయం పొందుతోన్న బాలికలకు భద్రత కల్పించాలని శిశు సంక్షేమ శాఖను స్వాతి మలివాల్ కోరారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఆశ్రమాల్లో తనిఖీలు నిర్వహించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. రాజధానిలోనే ఇలా ఉంటే, దేశవ్యాప్తంగా ఉన్న శరణాలయాల్లో పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.