యాప్నగరం

విమానం పేల్చేస్తాం: పైలట్ల బెదిరింపులు

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన పైలట్లే.. ఆ విమానం పేల్చేస్తామని బెదిరిస్తే? ఈ ఘటన మరెక్కడో కాదు మన దేశంలోనే చోటు చేసుకుంది.

TNN 19 Feb 2018, 5:07 pm
విమానం పేల్చేస్తామని సరదాగా వ్యాఖ్యానించినా అది పెద్ద నేరం. అలాంటిది, ఆ విమానం నడిపే పైలట్లే విమానం పేల్చేస్తామని ప్రయాణికులను హెచ్చరిస్తే పరిస్థితి ఏమిటీ? ప్రాణాలు గాల్లో కలిసిపోవూ! ఇలాంటి ఊహించని ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. గోఎయిర్ సంస్థకు చెందిన G8113 ఢిల్లీ-బెంగళూరు విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి ఉదయం 5.50కి బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులు 5.10 గంటలకే విమానంలో కూర్చున్నారు. అయితే పైలట్లు 7 దాటినా విమానం వద్దకు రాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
Samayam Telugu goair flyer at delhi airport claims pilot threatened to crash plane
విమానం పేల్చేస్తాం: పైలట్ల బెదిరింపులు


దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విమానంలోకి వచ్చిన పైలట్లకు ప్రయాణికులు వీడియో తీశారు. ఇది చూసిన పైలట్లు వీడియోలు తీయొద్దని చెప్పారు. ‘‘మీరు ఆలస్యంగా వచ్చారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతాం’’ అని ప్రయాణికులు వారిని హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన పైలట్లు ‘‘ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడితే విమానాన్ని పేల్చేస్తాం’’ అని బెదిరించినట్లు ప్రయాణికులు తెలిపారు.

పైలట్ల బెదిరంపులకు ప్రయాణికులు వణికిపోయారు. వెంటనే వారిని మార్చాలని డిమాండు చేశారు. ఇందుకు గోఎయిర్ యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో ముగ్గురు ప్రయాణికులు విమానం నుంచి దిగి వెళ్లిపోయారు. తాము కొన్ని అడ్మినిస్ట్రేషన్ పనుల వల్ల ఆలస్యంగా వచ్చామని, తమను మన్నించాలని పైలట్లు ప్రయాణికుల నుంచి క్షమాపణలు కోరారు. చివరికి యాజమాన్యం ప్రయాణికులను ఒప్పించడంతో విమానం ఉదయం 8.40 గంటలకు బయల్దేరి 11.20 గంటలకు బెంగళూరు చేరుకుంది.

ఈ ఘటనపై గోఎయిర్ యాజమాన్యం స్పందిస్తూ.. ఈ ఘటనపై అంతర్గత విచారణ చేపట్టామని, తమ పైలట్లు అలాంటి బెదిరింపులకు దిగలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిగా విచారించిన తర్వాతే విమానం బయల్దేరడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.