యాప్నగరం

గోద్రా కేసు: 11 మంది ఉరిశిక్షలు జీవితఖైదు‌గా మార్పు

గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్‌ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది.

TNN 9 Oct 2017, 12:38 pm
గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్‌ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో 11 మంది దోషులకు పడిన ఉరిశిక్షను జీవితఖైదుగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అలాగే ఈ కేసులో మరో 20 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే నిర్దోషులుగా ప్రకటించిన 63 మందిని మళ్లీ దోషులుగా చేర్చడం కుదరదని ప్రభుత్వానికి వెల్లడించింది. మరోవైపు రైలు దహన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లోగా బాధిత కుటుంబాలకు ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలని సూచించింది.
Samayam Telugu godhra case gujarat hc commutes death for 11 convicts to life in prison
గోద్రా కేసు: 11 మంది ఉరిశిక్షలు జీవితఖైదు‌గా మార్పు


2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రాలో రైలుని దహనం చేసిన విషయం తెలిసిందే. అయోధ్య నుంచి అహ్మదాబాద్‌కు వస్తున్న సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌పై గోద్రా స్టేషన్‌ వద్ద ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో 59 మంది మృతిచెందారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక ట్రయల్ కోర్టు 2011 మార్చి 1న తీర్పు వెల్లడించింది. ఇది ప్రమాదవశాత్తు జరగలేదని.. కుట్రపూరితంగా రైలుకు నిప్పటించారని కోర్టు పేర్కొంది. ఈ కేసులో 31 మందిని దోషులుగా తేల్చుతూ వారికి శిక్షలు ఖరారు చేసింది. వీరిలో 11 మందికి ఉరిశిక్ష విధించగా.. మిగతా 20 మందికి జీవితఖైదు పడింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా మరో 63 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. వీరిలో సిట్‌ పేర్కొన్న ప్రధాన సూత్రధారి మౌల్వీ సయీద్‌ ఉమార్జీ కూడా ఉన్నాడు.

ఉరిశిక్ష పడిన 11 మంది దోషులు.. ట్రయల్‌ కోర్టు తీర్పుపై గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు 63 మందిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం కూడా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. 11 మంది దోషులకు విధించిన మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించింది. నిర్దోషుల విషయంలో 2011 నాటి తీర్పును మార్చబోమని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై అగ్నిప్రమాద బాధిత కుటుంబాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. వారిని ఉరితీయడమే సరైనదని అని అభిప్రాయపడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.