యాప్నగరం

మహాత్మ గాంధీతో విభేదించిన కమలాదేవికి ‘డూడుల్’ నివాళి

కమలాదేవి ఎవరినీ లెక్క చేసేవారు కాదు. ఉప్పు సత్యాగ్రహంలో మహిళలు పాల్గొనడానికి వీళ్లేదని చెప్పిన మహాత్మ గాంధీతో కూడా కమలాదేవి విభేదించారు.

Samayam Telugu Kamaladevi
స్వాతంత్య్రోద్యమ సమయంలో దేశం కోసం పోరాడిన చాలా మంది గొప్ప వ్యక్తుల గురించి నేటి యువతకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రపంచంలోనే బతుకుతున్న యువత మన మేధావులను గుర్తుపెట్టుకోవడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మేధావులందరినీ గూగుల్ మనకు గుర్తుచేస్తోంది. స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, మేధావులు, దేశం గర్వించదగిన వ్యక్తుల జయంతి, వర్థంతిల నాడు వారిని డూడుల్ రూపంలో గూగుల్ మన ముందుకు తీసుకువస్తోంది. నేడు (ఏప్రిల్ 3న) కూడా గూగుల్ ఓ గొప్ప వ్యక్తిని మనకు గుర్తుచేసింది.

ప్రముఖ సామాజిక సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు కమలాదేవి ఛట్టోపాధ్యాయ 115వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమెకు డూడుల్‌తో గూగుల్ నివాళి అర్పించింది. మహిళల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కమలాదేవి. ఆమె ఆలోచనా విధానం నేటి తరానికి చాలా దగ్గరగా ఉంటుంది. కమలాదేవి 1903 ఏప్రిల్ 3న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కమలాదేవి.. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత కూడా శరణార్థులకు సేవలందించారు. సాంస్కృతిక కళలను ప్రోత్సహించారు. ఆమె సేవలకు గుర్తుగా నేడు గూగుల్ ఆమెను డూడుల్‌తో గౌరవించింది.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్, సంగీత్ నాటక్ అకాడమీ వంటి సాంస్కృతిక ఇన్‌స్టిట్యూట్‌లను దేశంలో ఏర్పాటుచేయడంలో కమలాదేవి ఛట్టోపాధ్యాయ కృషి ఎంతో ఉంది. దేశం కోసం ఎంతో సేవ చేసిన ఈమె.. చిన్న వయసులో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఏడేళ్లకే తన తండ్రిని కోల్పోయారు. 14 ఏళ్లకే వివాహం జరిగింది. 16 ఏళ్లు వచ్చేసరికి తన భర్తను కోల్పోయారు. చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు ఎదురైనా ఆమె వెనకడుగు వేయలేదు. విద్యను అభ్యసించడానికి లండన్ వెళ్లిపోయారు. 1923లో ప్రముఖ రచయిత, నటుడు, సంగీత విద్వాంసుడు హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ‌ను కమలాదేవి వివాహం చేసుకున్నారు. 1927లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

వాస్తవానికి కమలాదేవి ఎవరినీ లెక్క చేసేవారు కాదు. ఉప్పు సత్యాగ్రహంలో మహిళలు పాల్గొనడానికి వీళ్లేదని చెప్పిన మహాత్మ గాంధీతో కూడా కమలాదేవి విభేదించారు. దేశంలో రాజకీయ కార్యాలయాన్ని నడిపిన తొలి భారత మహిళ కూడా ఈమే కావడం విశేషం. 1926లో మద్రాస్‌ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన కమలాదేవి 55 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ మహిళా హక్కులపై ఆమె పోరాటాన్ని ఆపలేదు. లింగ సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ ప్రముఖ సామాజిక కార్యకర్తలతో చేతులు కలిపి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కమలాదేవి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1955లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆ తరవాత 1987లో దేశ రెండో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో ప్రభుత్వం గౌరవించింది. అంతేకాకుండా 1966లో రామన్ మెగ్‌సెసె అవార్డును కమలాదేవి అందుకున్నారు. వీటితో పాటు సంగీత నాటక అకాడమీ నుంచి కూడా ఈమె అవార్డులు పొందారు. కమలాదేవి మంచి రచయిత కూడా. మహిళల హక్కులు, సాంస్కృతిక కళలపై 15కు పైగా పుస్తకాలు రచించారు. 85 ఏళ్ల వయసులో 1988 అక్టోబర్ 29న కమలాదేవి కన్నుమూశారు.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.