యాప్నగరం

ఆవిధంగా నాకు డబుల్ హ్యాపీ: మోదీ

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ద్వారా యావత్‌ దేశానికి మరోసారి అభివృద్ధి సందేశం వెళ్లిందని ప్రధాని మోదీ అన్నారు. రెండు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన నేపథ్యంలో ఢిల్లీలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

TNN 18 Dec 2017, 10:11 pm
గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ద్వారా యావత్‌ దేశానికి మరోసారి అభివృద్ధి సందేశం వెళ్లిందని ప్రధాని మోదీ అన్నారు. రెండు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం (డిసెంబర్ 18) సాయంత్రం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘తరచూ ఎన్నికలు జరిగే దేశంలో ఒక రాజకీయ పార్టీ ఆయా రాష్ట్రాల్లో వరసగా విజయాలు సాధించడం గొప్ప విషయం. అది ప్రజల ఆకాంక్షలకు అభివ్యక్తీకరణ. ఈ ఫలితాలు వ్యక్తిగతంగా నన్ను సంతోషపెట్టడమేకాదు.. మోదీ లేకపోయినా గుజరాత్‌లో బీజేపీ నిలదొక్కుకొని, విజయం సాధిస్తుందని చాటిచెప్పాయి. ఆవిధంగా నాకు డబుల్‌ హ్యాపీ’ అని ప్రధాని అన్నారు.
Samayam Telugu gujarat and himachal pradesh election results pm modis address after twin win
ఆవిధంగా నాకు డబుల్ హ్యాపీ: మోదీ


గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు, కార్యకర్తలకు మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘గుజరాత్‌, హిమాచల్‌ ప్రజలు అభివృద్ధి బాటను ఎంచుకున్నారు. వారికి కృతజ్ఞతలు. సంస్కరణలకు ఆమోదం తెలపడానికి ఈ దేశం సిద్ధంగా ఉందన్న విషయం నేటి ఫలితాల్లో ప్రస్ఫుటమైంది’ అని ఆయన అన్నారు.

‘గుజరాత్‌ బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే అన్ని రాష్ట్రాలూ బాగుపడతాయి. గుజరాత్‌లో గెలుపు కోసం ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజలు సమర్థంగా తిప్పికొట్టారు. గడిచిన కొద్ది రోజులుగా గుజరాత్‌లో ఏం జరిగిందో అందరం చూశాం. వారు (విపక్షాలు) కుల వైషమ్యాలను రెచ్చగొట్టారు. కానీ, మేం అభివృద్ధి బాటలోనే ఉంటామని ప్రజలు మరోసారి జవాబిచ్చారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఏ ఒక్క గుజరాతీని కూడా మనం వేరుగా చూడొద్దు. అందరం కలిసికట్టుగా పనిచేయడానికి ప్రయత్నిద్దాం’ అని మోదీ చెప్పుకొచ్చారు.

ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని విస్మరించినా, తప్పుడు పనులు చేసినా ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని మోదీ అన్నారు. అక్కడి ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఆయన తెలిపారు. దేశ ప్రజలు.. ప్రత్యేకించి మధ్య తరగతివారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తామని మోదీ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.