యాప్నగరం

మోదీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీనే: శివసేన చీఫ్!

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించినా రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ తుదివరకు పోరాడింది. అయితే విజయాన్ని మాత్రం ఆ పార్టీ అందుకోలేకపోయింది.

TNN 18 Dec 2017, 1:11 pm
వరుసగా ఆరోసారి గుజరాత్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీకి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనే ఇచ్చింది. అయితే తుది అంకంలో మాత్రం కాంగ్రెస్ చతికిలబడింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి గుజరాత్‌లో గెలిచి కానుకగా ఇవ్వాలని ఆ పార్టీ భావించింది. గుజరాత్‌లో కాంగ్రెస్ ఓటమిపై శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే స్పందించారు. కాంగ్రెస్ ఓడిపోయినా రాహుల్ గాంధీపై ఉద్దవ్ థాక్రే ప్రశంసలు కురిపించారు. గుజరాత్ ఫలితం ఎలా ఉన్నా, కాంగ్రెస్ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోయడంలో రాహుల్ పరిపూర్ణత సాధించాడని, బీజేపీకి, నరేంద్ర మోదీకి ఎదురు నిలువగల ఏకైక నేత ఆయన మాత్రమేనని, యువరాజును ఎవరు తక్కువ అంచనా వేసినా నష్టపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.
Samayam Telugu gujarat assembly election 2017 shivsena chief uddhav thackeray praises rahul gandhi
మోదీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీనే: శివసేన చీఫ్!


మోదీ, అమిత్ షా లాంటి దిగ్గజ నేతలు గుజరాత్ ఎన్నికల రణక్షేత్రంలో ఉండగా, వారిని రాహుల్ ఎదుర్కొన్న తీరు అద్భుతమని కొనియాడారు. ఇక కేంద్రంలోని అధికార బీజేపీ రాహుల్‌ను విమర్శించడం మానుకొని, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని తలంటారు. అంతేకాదు దేశ రాజకీయాల్లో ఇక రాహుల్ శకం మొదలైనట్టేనని ఉద్ధవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. అలాగే కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఆ పార్టీకి జవసత్వాలు కలిగించాల్సిన బాధ్యత రాహుల్ భుజస్కందాలపై ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉద్ధవ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్, శివసేన సిద్ధాంతాల్లో చాలా వ్యత్యాసం ఉందని, అవసరమైతే దేశం కోసం కలిసి పనిచేసే అవకాశం ఉందని అన్నారు. రాహుల్ గాంధీపై నమ్మకంలేని మూఢనమ్మకాల బ్యాచ్ కూడా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. దేశాభివృద్ధిలో నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పాత్రలేదని వాదిస్తున్నారని, నాటి నేతలు వేసిన బలమైన రాజకీయ పునాదుల వల్ల ఈనాడు ప్రయోజనం పొందుతున్నారని, దీనిపై జ్ఞానం, కృతజ్ఞత లేకుండా మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేతల పేర్లను ప్రస్తావించని థాక్రే, పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు గత 60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధి, ఈ మూడున్నరేళ్లలో సాధ్యమైందని మాట్లాడేవాళ్లు మూర్ఖులని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.