యాప్నగరం

లాల్చీ శుభ్రం చేసిన గన్‌మెన్.. వివాదంలో కర్ణాటక డిప్యూటీ సీఎం

వివాదంలో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.

Samayam Telugu 5 Sep 2018, 6:59 pm
కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర వివాదంలో చిక్కుకున్నారు. ఆయన లాల్చీపై పడిన బురదను గన్‌మెన్‌తో శుభ్రం చేయించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు మండిపడుతున్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి పనులు చేయడం ఏంటంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

పరమేశ్వరన రెండు రోజుల పాటూ బెంగళూరులో పర్యటించారు. ఉల్సూరులోని ఎల్లమ్మ కోయిల్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ స్థానిక కార్పొరేటర్‌తో పాటూ స్థానికులతో మాట్లాడి.. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం లాల్చీ, ప్యాంట్‌కు దుమ్ము అంటుకుంది. తర్వాత గన్‌మెన్ వచ్చి ఆ దుమ్మును కర్చీఫ్‌తో తుడిచాడు. ఈ సీన్ మొత్తాన్ని అక్కడే ఉన్న స్థానికుల్లో ఒకరు మొబైల్‌లో రికార్డ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు పరమేశ్వరపై మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏంటని ఫైరవుతున్నారు.

ఈ వివాదంపై పరమేశ్వర స్పందించారు. తన దగ్గర పనిచేసే సిబ్బందితో రోజూ పర్యటనలకు వెళుతుంటానని.. వారిని తన సొంత కుటుంబంలా చూసుకుంటానన్నారు. వారే తన బలమని.. తనపై విమర్శలు రావడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో లాల్చీపై పడిన దుమ్మును స్థానిక కార్పొరేటరైన శ్రీనివాసన్ శుభ్రం చేసేందుకు ప్రయత్నించగా.. డిప్యూటీ సీఎం వారించి గన్‌మెన్‌ను పిలిపించి శుభ్రం చేయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.