యాప్నగరం

హథ్రాస్ ఘటనలో యోగీ సర్కార్ సంచలనం.. వారందరిపై దేశద్రోహం కేసు.. 19 ఎఫ్ఐఆర్‌లు!

హథ్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా అశాంతి నెలకొన్న తరుణంలో ఉత్రప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 5 Oct 2020, 9:17 pm
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటనకు సంబంధించి ఆ రాష్ట్రవ్యాప్తంగా 19 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులపై ఆ రాష్ట్ర పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనను తప్పుదోవ పట్టించేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై దేశ ద్రోహం, కుట్ర కోణం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Samayam Telugu హథ్రాస్ బాధితురాలి దహనసంస్కారాలు (ఫైల్ ఫొటో)


తమ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుజేయడం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ కేసులు నమోదు చేయడం గమనార్హం.

‘‘హథ్రాస్ ఘటనను అడ్డు పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో క్రిమినల్ కుట్రకు తెర తీస్తున్నారు. ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా బురదజల్లి.. సామూజిక అశాంతిని సృష్టిస్తున్నారు. బాధిత కుటుంబం సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కూడా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధిత కుటుంబం మాట్లాడేటట్లు కొందరు వ్యవహరించారు. అలాంటివి టీవీల్లో కూడా ప్రసారం చేశారు. కొన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కుల వైషమ్యాలను పెంచారు. వీటన్నింటి ద్వారా రాష్ట్రంలో అశాంతిని రగిల్చడానికి ప్రయత్నం చేశారు.’’ అని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

సోషల్ మీడియా, పోస్టర్ల ద్వారా వాతావరణాన్ని పూర్తిగా చెడగొడుతున్నారని, కుల హింసను ప్రోత్సహిస్తున్నారని శాంతిభద్రతల డీజీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని భంగపరచాలని చూస్తున్నారని, వైరల్ ఆడియో ద్వారా వాతావరణాన్ని చెడగొడుతున్నారని డీజీ పేర్కొన్నారు. అందుకే వారిపై దేశద్రోహం, మత విద్వేషాల వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.