యాప్నగరం

హిమాచల్ లో కొనసాగిన సంప్రదాయం

కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసు, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి కలిసివచ్చింది.

Amrutha Vasireddy | TNN 18 Dec 2017, 2:11 pm
ఒకే పార్టీకి వరసగా రెండుసార్లు అధికారం లభించకపోవడం హిమాచల్ ప్రదేశ్‌లో ఆనవాయితీగా వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా దీన్నే బలపరిచాయి. అయితే అవి నిజం కావని, ఈ రాష్ట్రంలో తాము అధికారాన్ని నిలుపుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. చివరకు ఓటర్లు మాత్రం పాత సంప్రదాయాన్నే నిజం చేశారు. ఇక్కడ 1990లో బీజేపీ, 1993లో కాంగ్రెస్, 1998లో మరలా బీజేపీ, 2003లో కాంగ్రెస్, 2007లో మరోసారి బీజేపీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాయి.
Samayam Telugu himachal elections voters continues tradition
హిమాచల్ లో కొనసాగిన సంప్రదాయం


హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 68 స్థానాలకు మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్ఇద్దరూ పోటీ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీలోని 68 సీట్లకూ అభ్యర్థులను నిలిపాయి. ఈ రాష్ట్రంలో 75.28 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది. వీరభద్ర సింగ్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ప్రధానంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసు, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి కలిసివచ్చింది. చివరకు ఫలితాలు కాషాయానికే కలిసివచ్చాయి. ఉన్న 68 సీట్లలో 45 సాధించి కాంగ్రెస్ కంటే స్పీడుగా దూసుకుపోయింది.


రాష్ట్రంలో ఫలితాలు కమలనాధులకు కలిసిరాగా కాలం కలిసిరాకపోవటం అంటే ఏమిటో హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ను చూస్తే తెలుస్తుంది. అధికారం చేపట్టేందుకు పార్టీ సిధ్ధంగా ఉన్న దశలో ఆయన మాత్రం పరాజయం పాలయ్యారు. సుజన్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న ప్రేమ్ కుమార్ ధుమాల్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగుతూ అత్యధిక స్థానాలలో విజయం దిశగా సాగుతుండగా, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పరాజయం పాలవ్వడం విశేషం. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని మొత్తం నాలుగుస్థానాలను భాజపా తన ఖాతాలో వేసుకోవటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.