యాప్నగరం

అదో చారిత్రక క్షణం.. అయోధ్యపై నాటి ఫోటోను షేర్ చేస్తూ అద్వానీ భావోద్వేగం

అయోధ్య అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, బీజేపీ బలోపేతానికి ఎల్కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషీలు కారణమయ్యారు. అయితే, వీరికి తొలుత శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదు.

Samayam Telugu 5 Aug 2020, 10:04 am
అయోధ్య శ్రీరామ మందిరం భూమిపూజ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అద్వాణీ భావోద్వేగ సందేశం ఇచ్చారు. తనతోపాటు దేశ ప్రజలందరికీ ఇదో చారిత్రక, ఉద్వేగభరిత క్షణమన్నారు. 1990లో సోమనాథ్‌ నుంచి అయోధ్య వరకు తాను చేపట్టిన రథయాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రథయాత్రలో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర రూపంలో నాకు అదృష్టం దక్కిందని, ఇందులో పాల్గొనేవారి ఆకాంక్ష, ఆశక్తులు, అభిరుచులకు సహాయపడిందన్నారు. నా హృదయంలోని కల దగ్గరగా ఉందని అన్నారు.
Samayam Telugu అయోధ్యపై అద్వాణీ భావోద్వేగం
LK Advani


‘కొన్నిసార్లు ముఖ్యమైన కలలు నిజం కావడానికి సమయం పడుతుంది, కానీ అవి నెరవేరినప్పుడు, వేచి ఉండటం అర్థవంతంగా మారుతుంది. నా హృదయానికి దగ్గరలో ఉన్న అలాంటి ఒక కల నెరవేరుతుంది. జై శ్రీ రామ్’ అంటూ అద్వాణీ ట్వీట్ చేశారు.

దృఢమైన, సుసంపన్నమైన, శాంతి, సామరస్యంతో కూడిన భారతావనికి రామమందిరం ఓ ప్రతీకగా నిలుస్తుందని అద్వాణీ విశ్వాసం వ్యక్తంచేశారు. అందరికీ సమన్యాయం, సుపరిపాలన అందాలని, దేశం రామరాజ్యంలా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. రామజన్మభూమి ఉద్యమంలో భాగస్వామి కావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, నాగరిక వారసత్వంలో శ్రీరాముడికి గౌరవస్థానం ఉందన్నారు.

భారతపౌరుల్లో శ్రీరాముడి సద్గుణాలు ప్రేరేపించేందుకు ఆలయం దోహదపడుతుందన్నారు. కరోనా నేపథ్యంలో 93 ఏళ్ల అద్వాణీ ఈ వేడుకకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయోధ్య అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని తీసుకొచ్చిన ఘనత అద్వాణీకి దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రామ మందిర ఉద్యమానికి రథయాత్ర ఎంతగానో ఉపయోగపడి, బీజేపీకి బలమైన పునాదులు వేసింది.

అయితే, రామమందిర శంకుస్థాపనకు తొలుత అద్వాణీ, మురళీమనోహర్ జోషీలకు ఆహ్వానం పంపకపోవడంపై దుమారం రేగింది. ఇది, వివాదం కావడంతో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ ఇద్దరు నేతలను చివరి నిమిషంలో టెలిఫోన్ ద్వారా ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో ఆయన వీడియో ద్వారా ఇందులో పాల్గొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.