యాప్నగరం

బాబర్..హుమయూన్‌కు కుమారుడట: రాజస్థాన్ బీజేపీ చీఫ్!!

మొఘల్ చక్రవర్తుల గురించి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. గోవులు, మహిళలు, బ్రాహ్మణుల్ని అవమానించవద్దని మొఘల్ చక్రవర్తి హుమయూన్ తన చివరి ఘడియల్లో కుమారుడు బాబర్‌కు చెప్పాడని బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీ వ్యాఖ్యానించడమే అందుకు కారణం.

Samayam Telugu 27 Jul 2018, 1:09 pm
మొఘల్ చక్రవర్తుల గురించి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. గోవులు, మహిళలు, బ్రాహ్మణుల్ని అవమానించవద్దని మొఘల్ చక్రవర్తి హుమయూన్ తన చివరి ఘడియల్లో కుమారుడు బాబర్‌కు చెప్పాడని బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీ వ్యాఖ్యానించడమే అందుకు కారణం. అల్వార్ జిల్లాలో గత శుక్రవారం గోసంరక్షకులు హరియాణాకు చెందిన రక్బర్ ఖాన్‌ అనే వ్యక్తిపై మూకదాడికి పాల్పడి హతమార్చిన అంశంపై ఆయన మాట్లాడుతూ.. సమాజం, దేశం, మతాల నమ్మకాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. బాబరు కొడుకు హుమయూన్ అయితే, హుమయూన్‌ కుమారుడు బాబరు అంటూ ఆయన పేర్కోవడంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
Samayam Telugu బీజేపీ రాజస్థాన్ చీఫ్ సైనీ


జైపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జీవిత చరమాంకంలో హుమయూన్ తన కుమారుడు బాబర్‌ను పిలిపించుకుని, నువ్వు భారత్‌ను పాలించాలనుకుంటే మూడు అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు. అవి గోవులు, మహిళలు, బ్రాహ్మణులు. వీళ్ల గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు.. ఈ మూడు విషయాల్లో అలసత్వం వహిస్తే భారత్ సహించబోదని హెచ్చరించాడు’అని సైనీ అన్నారు. అంతేకాదు మత మౌఢ్యునిగా పేరుపొందిన ఔరంగజేబు సైతం గో హత్యలను నిషేధించారని, ముస్లిం చక్రవర్తులు ఎవరూ అవుల భక్షణను అనుమతించలేదని వ్యాఖ్యానించాడు.

అయితే రెండో మొఘల్ చక్రవరి హుమయూన్ తండ్రి బాబరైతే, సైనీ ఏకంగా ఆయనను కుమారుణ్ని చేసేయడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన తొలి మొఘల్ చక్రవరి బాబర్ 1530లోనే చనిపోయాడు.. ఆయన కుమారుడైన హుమయూన్ 1556లో గ్రంథాలయం మెట్లమీద నుంచి జారిపడి మరణించాడు... మరి తండ్రినే పిలిచి కొడుకు ఈ విషయాలు ఎలా చెప్పాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందు రక్బర్ ఖాన్‌ను ఆవులను స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా పేర్కొన్న మదన్‌లాల్, అతడిపై కేసులు కూడా ఉన్నాయనడం గమనార్హం. అయితే ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకున్న ఆయన ప్రజాస్వామ్యంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని, చట్టాన్ని ఎవరూ తమ చేతిలోకి తీసుకోరాదని అంటూ వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. మరోవైపు సైనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ నేతలకు చరిత్రను వక్రీకరించడం అలవాటైపోయిందని రాజస్థాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అర్చనా శర్మ ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.