యాప్నగరం

వేరే మహిళతో భార్యను పోల్చడం క్రూరత్వమే.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

భార్యను ఇతర మహిళలతో పోల్చడం.. అందంగా లేవని సూటిపోటి మాటలతో వేధించడం క్రూరత్వమేనని.. విడాకుల మంజూరుకు దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చని కేరళ హైకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. అందం విషయంలో అంచనాలు తల్లకిందులయ్యాయని, అనుకున్నంత అందంగా లేవని తనను రోజూ మాటలతో దెప్పిపొడుస్తున్నాడని బాధిత మహిళ చేసిన ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తనకు విడాకులు మంజూరు చేయాలన్న ఆమె వాదనలను సమర్దించింది. అయితే, కింది కోర్టు తీర్పును భర్త సవాల్ చేశాడు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 17 Aug 2022, 1:26 pm

ప్రధానాంశాలు:

  • విడాకుల కేసులో కేరళ హైకోర్టు సంచలన తీర్పు.
  • భార్యను ఇతరులతో పోల్చడం తప్పుబట్టిన కోర్టు.
  • ఫ్యామిలీ కోర్టు తీర్పును మార్చడానికి నిరాకరణ.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కేరళ హైకోర్టు
ఇతర మహిళలతో భార్యను పోల్చడం, అందం విషయంలో తన అంచనాలను అందుకోలేకపోయావని పదే పదే భర్త వెక్కిరించడం క్రూరత్వమే అవుతుందని, ఈ కారణంతో విడాకులు (Kerala Divorce Case) మంజూరు చేయడం సబబేనని కేరళ హైకోర్టు (Kerala High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఆగస్టు 4న జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ సీఎస్ సుధాలతో (Kerala Divison Bench) కూడిన ధర్మాసనం ఈ మేరకు కుటుంబ న్యాయస్థానం (Family Court) ఇచ్చిన తీర్పును సమర్దించింది. తన భర్త క్రూరంగా వ్యవహరిస్తున్నాడని, సూటిపోటి మాటలతో మానసిక వేధనకు గురిచేస్తున్నాడని పేర్కొంటూ ఓ మహిళ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆమె వాదనలను సమర్దించిన ఫ్యామిలీ కోర్టు.. విడాకులు మంజూరు చేసింది.
అయితే, ఈ తీర్పును సదరు భర్త కేరళ హైకోర్టులో సవాల్ చేయగా.. జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ సీఎస్ సుధ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘పిటిషనర్ తన అంచనాలకు అనుగుణంగా భార్య లేదని ప్రతివాది/ భర్త నిరంతరం పదేపదే తిట్టడం.. ఇతర మహిళలతో పోల్చడం మొదలైనవి ఖచ్చితంగా మానసిక క్రూరత్వం కిందకు వస్తాయి.. దానిని భార్య భరించలేదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అందం విషయంలో తన అంచనాలు తారుమారయ్యాయని, అనుకున్నంత అందంగా లేవని, సోదరుడి భార్య సహా మరికొందరు మహిళలతో పోల్చుతుండటంతో తాను తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నానని బాధితురాలు ఆరోపించింది. అయితే, ఇది విడాకులకు సరైన కారణం కాకపోయినప్పటికీ వారి వైవాహిక బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమయ్యిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో పార్టీలు, సమాజం అభిరుచులకు పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొంది.

వివాహ బంధాన్ని సాధ్యమైనంత వరకు కొనసాగించాలని ప్రజాప్రయోజనాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. భాగస్వామి ఆశలు పునరుద్దరించలేని విధంగా దెబ్బతింటే వాస్తవాన్ని గుర్తించాలని పేర్కొంటూ విడాకులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.