యాప్నగరం

నేను బ్రాహ్మణుడిని, నా గోత్రం ఇదే.. బీజేపీకి రాహుల్ ఘాటు జవాబు

రాహుల్ జీ మీరు హిందువైతే.. మీ గోత్రమేంటో చెప్పాలని కొన్నాళ్లుగా విమర్శలు చేస్తోన్న బీజేపీకి రాహుల్ గాంధీ ధీటుగా బదులిచ్చారు.

Samayam Telugu 26 Nov 2018, 5:11 pm
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతోన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాను హిందువునని చెప్పుకోవడానికి రాహుల్ ఆసక్తి చూపుతుండగా.. ఆయన గోత్రమేంటో చెప్పాలంటూ బీజేపీ నిలదీస్తోంది. తెలంగాణ రాజకీయాలపై మతం ప్రభావం తక్కువే కానీ.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల్లో మతం ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది. రాజస్థాన్‌లో హిందువుల ఓట్లను కొల్లగొట్టడం కోసం ‘అయోధ్య రామ మందిరం’ నిర్మాణ అంశాన్ని బీజేపీ తెర మీదకు తీసుకొస్తోంది.
Samayam Telugu rahul gandhi at temple


కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా హిందువుల్ని తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ హిందువైతే.. ఆయన గోత్రమేంటో చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. దీనికి రాహుల్ గాంధీ దీటుగా బదులిచ్చారు. తాను బ్రాహ్మణుడినని చెప్పిన రాహుల్.. తనది దత్తాత్రేయ గోత్రమని తెలిపారు.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్.. సోమవారం పుష్కర్‌లోని ఓ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా.. అక్కడి పూజారి రాహుల్‌ను గోత్రం అడిగారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు తన గోత్రాన్ని వెల్లడించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. రాహుల్‌ది ‘దత్తాత్రేయ’ గోత్రమని చెప్పిన ఆలయ పూజారి.. కాంగ్రెస్ చీఫ్‌ కశ్మీర్ బ్రాహ్మణుడని చెప్పారు.

గుజరాత్ ఎన్నికలు సహా.. ఇతర రాష్ట్రాల ఎన్నికల సమయంలో రాహుల్ ఆలయాలను సందర్శించారు, తనను తాను శివభక్తుడిగా అభివర్ణించుకున్నారు. కాగా, రాహుల్ ఆలయాలకు వెళ్లడాన్ని బీజేపీ విమర్శించింది. ‘రాహుల్ జంధ్యం ధరిస్తే.. అది ఎలాంటిది? ఆయన గోత్రమేంటి?’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా ఇటీవల విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.