యాప్నగరం

హనీట్రాప్‌లో ఐఏఎఫ్ అధికారి.. ఐఎస్ఐ చేతికి కీలక పత్రాలు!

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రధానకార్యాలయంలో పనిచేసే ఓ అధికారి పాక్ గూఢచారి సంస్థ విసిరిన హానీట్రాప్‌ వలలో చిక్కుకున్నారు.

TNN 9 Feb 2018, 11:57 am
వాయుసేనకు చెందిన రహస్య పత్రాలను పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ‌కు అందజేశారనే ఆరోపణలతో ఐఏఎఫ్ అధికారి, గ్రూప్ కెప్టెన్ అరుణ్ మార్వాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఏఎఫ్ ప్రధానకార్యాలయంలోని ఈ పత్రాలను తన మొబైల్‌తో ఫోటోలు తీసి వాటిని వాట్సాప్ ద్వారా పాక్ గూఢచారులకు పంపినట్లు ఆధారాలు లభించడంతో ఆయనను అరెస్ట్ చేశామని ఢిల్లీ ప్రత్యేక విభాగం డీసీపీ ప్రమోద్ ఖుష్వాహ్ తెలిపారు. మార్వా వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తంచేస్తూ వాయుసేన విచారణ జరిపి, శత్రుదేశానికి సమాచారం చేరవేసినట్లు గుర్తించింది. దీంతో ఆయనను జనవరి 31 న విధుల నుంచి తొలగించారు. నకిలీ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఐఎస్ఐ విసిరిన హనీ ట్రాపింగ్ ఉచ్చులో చిక్కుకున్న మార్వా, వారికి కీలక సమాచారం అందించాడు.
Samayam Telugu iaf officer who leaked info to isi for sex chats arrested
హనీట్రాప్‌లో ఐఏఎఫ్ అధికారి.. ఐఎస్ఐ చేతికి కీలక పత్రాలు!


మాయమాటలతో ఆ అధికారిని లోబర్చుకుని, ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కీలక సమాచారాన్ని అందించడానికి మార్వా డబ్బులు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని, కేవలం లైంగికంగా రెచ్చగొట్టి రహస్యాలను తస్కరించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వాయుసేన శిక్షణ, యుద్ధ విన్యాసాలకు చెందిన కీలక రహస్యాలను ఐఎస్ఐకు అప్పగించినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. వీటిలో గగన్ శక్తి‌కి సంబంధించిన సమాచారం కూడా వారికి చేరినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదుపులోకి తీసుకున్న అరుణ్ మార్వాను పాటియాలా హౌస్ కోర్టుకు తరలించడంతో, ఆయనకు ఐదు రోజులు రిమాండ్ విధించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.

లోధి కాలనీలోని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో అతడిని విచారిస్తున్నట్లు తెలియజేశాయి. అలాగే ఈ రహస్యాలను స్వీకరించిన పాక్ వ్యక్తులను గుర్తించి, మరిన్ని వివరాలను సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐఏఎఫ్ సీనియర్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారిక రహస్య చట్టం సెక్షన్ 3, 5 ప్రకారం కేసును నమోదుచేశారు. మార్వా మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రధానకార్యాలయంలో విధులను నిర్వహించే మార్వా.. తనకు వాయుసేన గురించి కీలక సమాచారం తెలిసినట్లు అంగీకరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.