యాప్నగరం

యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. చైనాకు రావత్ వార్నింగ్

తూర్పు లడఖ్‌ సమీపంలోని ఎల్‌ఏసీ విషయమై భారత్, చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన విషయమై త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ఘాటుగా స్పందించారు.

Samayam Telugu 24 Aug 2020, 10:44 am
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చైనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లడఖ్‌లో చైనా బలగాల నియంత్రణ రేఖ అతిక్రమణలను అడ్డుకోవడానికి సైనిక చర్యకు సైతం వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. సరిహద్దులో బలగాల ఉపసంహరణకు చర్చలు జరుగుతున్నప్పటికీ.. డ్రాగన్ మాత్రం తన బలగాలను వెనక్కి తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రావత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Samayam Telugu Bipin-Rawat


ఇరు దేశాల సైన్యం మధ్య చర్చలు, దౌత్య మార్గం ద్వారా ఫలితం లేనప్పుడు.. మిలటరీ ఆప్షన్‌ను ఉపయోగిస్తామని రావత్ తెలిపారు. నియంత్ర రేఖ ఉల్లంఘనలను నిరోధించడానికి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎల్ఏసీ వెంబడి యధాతథ స్థితిని పునరుద్ధరించడానికి తీసుకుంటున్న చర్యలన్నీ విఫలమైతే.. రక్షణ బలగాలు సన్నద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

సైనికల బలగాల ఉపసంహరణపై గత రెండున్నర నెలలుగా భారత్, చైనా మధ్య అనేక దఫాలుగా మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు జరిగాయి. గురువారం కూడా ఇరుదేశాల దౌత్యవేత్తల మధ్య చర్చలు జరిగాయి. కానీ ఈ భేటీలో చెప్పుకోదగ్గ ఫలితం రాలేదని తెలుస్తోంది.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ మధ్య రెండు గంటలపాటు టెలిఫోన్ సంభాషణ జరిగిన అనంతరం.. బలగాల ఉపసంహరణ ప్రక్రియ జులై 6న ప్రారంభమైంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. చైనా సైన్యం ఈ తీర్మానం పట్ల సీరియస్‌గా లేదనేది ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఈ ఏడాది ఏప్రిల్ నాటి యధాతథ స్థితిని చైనా ఆర్మీ కొనసాగించాలని భారత సైన్యం పట్టుబడుతుండటంతో.. సైనిక చర్చల్లో ప్రతిష్టంభన తలెత్తినట్లు తెలుస్తోంది. చైనా ఆర్మీ నియంత్రణ రేఖను మార్చేయడం ఆమోద యోగ్యం కాదని భారత సైన్యం స్పష్టం చేసింది. చైనా బలగాలు నియంత్రణ రేఖ దాటి చొచ్చుకు రావడానికి ప్రయత్నించగా.. భారత సైన్యం నుంచి ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదురైంది. దీంతో పరువు కాపాడుకునేలా సైన్యాన్ని వెనక్కి రప్పించే యోచనలో చైనా ఉన్నట్లు తెలుస్తోంది.

చర్చల తర్వాత గల్వాన్ లోయ, ఇతర ప్రదేశాల నుంచి చైనా సైన్యం వెనక్కి మళ్లింది. కానీ పాంగాంగ్ త్సో, డెప్సాంగ్, ఇతర ప్రాంతాల నుంచి వైదొలగడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఐదుసార్లు కమాండర్ స్థాయి చర్చలు జరగా.. చైనా బలగాలను పూర్తిగా ఉపసహరించాలని భారత్ స్పష్టం చేసింది.

శీతాకాలంలో లడఖ్‌లో భారీగా బలగాల మోహరింపు కష్టం అవుతుంది. కానీ చైనాను కట్టడి చేయడం కోసం తూర్పు లడఖ్‌లోని కీలక ప్రాంతాల్లో చలి కాలంలోనూ ఇదే స్థాయిలో బలగాలను మోహరించడం కోసం భారత్ సన్నద్ధం అవుతోంది. చైనా బలగాలు దుందుడుకుగా వ్యవహరిస్తే ధీటుగా బదులిచ్చేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.