యాప్నగరం

ఐరాసలో మరోసారి పాక్‌ కుయుక్తి.. ధీటుగా బదులిచ్చిన భారత్

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై పదే పదే ప్రస్తావిస్తూ వివిధ దేశాల మద్దతు కూడగట్టడానికి దాయాది పాక్ చేయని ప్రయత్నం లేదు. అయితే, దాని కుటిల బుద్ధిని భారత్ తరుచూ తూర్పారబడుతోంది.

Samayam Telugu 23 Jan 2020, 1:06 pm
ఐక్యరాజ్యసమితి వేదిక సాక్షిగా దాయాది పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాక్ తరుచూ చేస్తున్న తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశంపై మరోసారి విషం వెళ్లగక్కిన పాక్.. తప్పుడు ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ సమాజాన్ని గందరగోళానికి గురిచేస్తుందని భారత్ తూర్పారబట్టింది. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా చేసే ప్రయత్నంలో భాగంగా ఐరాస వేదికలపై పాక్ తరుచూ లేవనెత్తుతోంది కానీ, దానికి మద్దతు కరవైయ్యిందని ఎద్దేవా చేసింది.
Samayam Telugu indo-pak


గతవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ తన చిరకాల మిత్రుడు చైనా సాయంతో కశ్మీర్ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి విఫలయత్నం చేసిందని దుయ్యబట్టింది. అయితే, కశ్మీర్ సమస్య కేవలం భారత్, పాక్ ద్వైపాక్షిక అంశమని భద్రతా మండలి సభ్యులకు తెలుసని పేర్కొంది. సాధారణ సభలో యూఎన్ సెక్రెటరీ జనరల్ నివేదికపై ఐరాసలో భారత శాశ్వత డిప్యూటీ ప్రతినిధి కే నాగరాజ్ నాయుడు బుధవారం మాట్లాడుతూ.. కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రస్తావించడం, దాని తప్పుడు ప్రచారంపై విరుచుకుపడ్డారు.

నిజాలను దాచిపెట్టి అసత్య ప్రచారంతో అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్థాన్ గందరగోళానికి గురిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. నీటి దగ్గరకు చేపను తీసుకెళ్లిన మాదిరిగా ప్రతిసారీ పాక్ ప్రతినిధి బృందం ద్వేషపూరిత వ్యాఖ్యలతో తమపై విషం గక్కుతూ, తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, అక్కడ మైనార్టీలను నాశనం చేసిన దేశం మైనార్టీల హక్కుల గురించి ఐరాసలో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

తప్పుడు ప్రవర్తనతో తలెత్తిన సమస్యలను పరిష్కరించకుండా అందరి దృష్టి మరల్చడానికి పాక్ అసత్య ప్రచారాన్ని తలకెత్తుకుందని భారత ప్రతినిధి మండిపడ్డారు. ఇకనైనా పాక్ తన వైఖరి మార్చుకుని తప్పుడు ప్రచారం ఆపాలని, దౌత్యపరంగా సాధారణ స్థితికి రావాలని నాయుడు హితవు పలికారు. ఐరాసలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రతినిధి సాద్ అహ్మద్ వరియంచ్ ప్రస్తావించగా, దానికి నాగరాజ్ నాయుడు ధీటుగా కౌంటర్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.