యాప్నగరం

చైనా సరిహద్దుల వెంబడి మోహరించిన భారత సైన్యం

డోక్లాం ప్రతిష్టంభన తొలగకపోవడంతో... భారత్ అప్రమత్తమైంది. చైనా సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తోంది.

TNN 12 Aug 2017, 8:43 am
డోక్లాం వివాదం నేపథ్యంలో.. భారత్‌తో యుద్ధం తప్పదంటూ చైనా అధికారిక మీడియాలో కథనాలు వస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. దౌత్యపరంగా ఈ సమస్యకు పరిష్కారం లభించపోతే.. సైనికపరంగానైనా ముందుకు వెళ్లాలని మన దేశం భావిస్తోంది. చైనా సరిహద్దుల వెంబడి సైనిక బలగాలను మోహరిస్తోంది. కాగా.. డోక్లాం వివాదం విషయంలో చైనా వ్యవహార శైలి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం భారత్, చైనాకు చెందిన మేజర్ జనరల్ స్థాయి అధికారులు శుక్రవారం నాథులా కనుమ వద్ద సమావేశమయ్యారు. భారత బలగాలు వెంటనే డోక్లాం నుంచి వెనక్కి మళ్లాలని ఈ భేటీలోనూ చైనా డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ సామాగ్రిని చైనా తొలగించాకే మా సైన్యం అక్కడి నుంచి కదులుతుందని భారత్ తెగేసి చెప్పింది.
Samayam Telugu india pumping in more soldiers weapons on entire eastern front
చైనా సరిహద్దుల వెంబడి మోహరించిన భారత సైన్యం


అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల్లోని చైనా సరిహద్దుల వెంబడి భారత్ బలగాలను పెంచుతోంది. యుద్ధంలో కీలకంగా మారే అవకాశం ఉన్న ప్రాంతాలకు సైన్యాన్ని క్రమంగా తరలిస్తోంది. లడఖ్ నుంచి అరుణాచల్ వరకూ 4057 కి.మీ. మేర.. సరిహద్దు వెంబడి ఎక్కడైనా చైనాను ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ సన్నద్ధం అవుతోంది. చైనా బలగాల కదలికలకు దీటుగా భారత సైన్యాన్ని మోహరిస్తున్నట్లు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో తెలిపారు.

తూర్పు సరిహద్దుల్లో మనకు సుక్నాలో 33 కార్ప్స్ ప్రధాన కార్యాలయం ఉంది. దీని పరిధిలో గ్యాంగ్‌టక్‌ (17 డివిజన్లు), కలిమ్‌పాంగ్‌(27), బిన్నగురి (20) మౌంటెన్ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్లో 10000 - 15,000 మంది సైనికులు ఉన్నారు. వీరంతా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. చైనా వివాదం నేపథ్యంలో భారత వైమానిక దళం కూడా అప్రమత్తమైంది. ఈశాన్య ప్రాంతంలోని ఎయిర్‌ బేసుల ద్వారా గగనతల నిఘాను పెంచింది.

టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్‌లో.. చైనా బలగాలు, యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను మోహరిస్తోంది. ఈ విషయం పసిగట్టిన భారత్ చైనాను ఎదుర్కోవడం కోసం సరిహద్దుల వెంబడి బలగాలను పెంచుతోంది. కానీ అసలు వివాదానికి కేంద్రమైన డోక్లాంలో మాత్రం 300-350 మంది భారత సైనికులే ఉన్నారు. చైనా అక్కడ 1500 మంది సైనికులను మోహరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.