యాప్నగరం

కశ్మీర్‌పై ఓఐసీ తీర్మానం ఘోర తప్పిదం.. తీవ్రంగా స్పందించిన భారత్

గతేడాది ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌కు కేంద్రం ప్రత్యేక హోదాను రద్దుచేసిన తర్వాత దాయాది పరిస్థితి కాలిగాలిన పిల్లిలా మారింది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై చర్చించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది.

Samayam Telugu 30 Nov 2020, 8:20 am
జమ్మూ కశ్మీర్ విషయంలో దాయాది పాకిస్థాన్‌ చేయని ప్రయత్నం లేదు. అంతర్జాతీయ వేదికలపై దీనిని చర్చించాలని పట్టుబడుతోంది. తాజాగా, నైగర్ వేదికగా జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (ఓఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్‌ను ప్రత్యేకాంశంగా పరిగణించినట్టు పాకిస్థాన్ శనివారం ప్రకటించింది. నవంబరు 27, 28న జరిగిన సమావేశంలో జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని ప్రత్యేకంగా చర్చించాలని పాకిస్థాన్‌ కోరింది. తొలుత దీనిని ఓఐసీ తిరస్కరించినట్టు వార్తలు వచ్చినా.. తర్వాత తీర్మానం చేసింది. మొత్తం 57 సభ్యదేశాలున్న ఓఐసీలో కశ్మీర్‌పై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్టు పేర్కొంది.
Samayam Telugu కశ్మీర్ అంశం
Kashmir Issue


ఓఐసీ 47వ విదేశాంగ మంత్రుల సమావేశంలో.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేయడం ఏకపక్షం.. చట్టవిరుద్ద చర్యలని తీర్మానించింది. ఈ ప్రకటనపై స్పందించిన భారత్‌.. జమ్మూ కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌‌కు ఓఐసీ వంత పాడటంలో ఆశ్చర్యమేమీ లేదని వ్యాఖ్యానించింది. అంతేకాదు, కశ్మీర్‌పై ప్రత్యేకంగా చర్చించాల్సినంత ప్రాధాన్యతలేదని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలపై ఓఐసీ తీర్మానాలను ఆమోదిస్తే అది ఘోరమైన తప్పుఅని, కృతజ్ఞత లేని, అనవసరమైన సూచన అని తీవ్రంగా ఖండించింది.

ముస్లిం ప్రపంచం సమిష్టి గొంతుగా తనను తాను అభివర్ణించే ఓఐసీ.. పాక్ ఆదేశాల మేరకు భారత్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొంటుందని ఆరోపించింది. జమ్మూ కశ్మీర్‌ సహా భారత అంతర్గత విషయాలలో ఓఐసీకి ఓ ఖచ్చితమైన విధానం లేదని, దానిని ఇప్పుడూ కొనసాగించిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని,విడదీయరాని భాగమని మరోసారి భారత్ తేల్చిచెప్పింది.

‘మత ఘర్షణలు, తీవ్రవాదం, మైనారిటీలను హింసించడంలో ఘనమైన రికార్డు కలిగి దేశం.. భారత్‌కు వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకోవడానికి ఓఐసీ అనుమతించడం విచారకరం.. భవిష్యత్తులో ఇటువంటి సూచనలు చేయకుండా ఉండాలని గట్టిగా సలహా ఇస్తున్నాం’ అని విదేశాంగ శాఖ మండిపడింది.

కశ్మీర్ అంశంపై తీర్మానానికి నిరాకరించిన ఓఐసీ.. తొలి రోజే నవంబరు 27న సౌదీ అరేబియా, టర్కీ, నైగర్ విదేశాంగ మంత్రులు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం గమనార్హం. కశ్మీర్‌కు బలమైన, ‘నిస్సందేహమైన’ మద్దతును వ్యక్తం చేస్తున్నప్పుడు... ఓఐసీ తీర్మానం కూడా కశ్మీరీయేతరులకు నివాస ధృవీకరణ పత్రాలను జారీ చేయడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.