యాప్నగరం

దేశంలో కొత్తగా 3,823 కరోనా కేసులు.. ఢిల్లీలో 14 శాతం దాటిన పాజిటివిటీ రేటు

దేశంలో ఇన్‌ఫ్లూయెంజా ఏ రకం వైరస్‌ కేసులతో పాటు కోవిడ్ వైరస్ వ్యాప్తి అలజడి రేపుతోంది. ప్రపంచంలోనే అత్యధిక రేటుతో కరోనా కేసులు భారత్‌లో పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. చాలా దేశాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. భారత్ సహా కొన్ని ఆసియా దేశాల్లో కేసులు పెరుగుతుండటం గమనార్హం. నిన్న మొన్నటి వరకూ 1 శాతంలోపే ఉన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు 3 శాతానికి చేరువైనట్టు గణాంకాలు తెలిపాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 2 Apr 2023, 11:27 am

ప్రధానాంశాలు:

  • దేశంలో 3 శాతానికి చేరువలో రోజువారీ పాజిటివిటీ రేటు
  • మహారాష్ట్ర, ఢిల్లీలో భారీగా నమోదువుతున్న కేసులు
  • ప్రపంచంలో భారత్‌లోనే అత్యధిక పెరుగుదల
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Covid Cases
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రెండు వారాలుగా రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,823 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ముందు రోజు (2,997 కేసులు)తో పోల్చితే ఇవి 27 శాతం అధికం. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ 1,33,153 నమూనాలను పరీక్షించగా.. 3,823 మందికి వైరస్ నిర్దారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, మరో 1,784 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,41,73,335గా ఉంది. రికవరీల రేటు 98.72 శాతం కాగా.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,369కి చేరింది.
అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు దాదాపు 3 శాతానికి చేరువకాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏడు నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. మొత్తం 416 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ముందు రోజు 195 కేసులతో పోల్చితే ఇది 40 శాతం అధికం. గత 24 గంటల్లో 2,985 మంది నమూనాలను పరీక్షించగా.. 416 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంటే ఢిల్లీలో పాజిటివిటీ రేటు 14.37 శాతంగా నమోదయ్యింది. కరోనాతో ఒకరు చనిపోయారు. మహారాష్ట్రలోనూ మరో 669 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇందులో ఒక్క ముంబయి నగరం నుంచే 347 కేసులు ఉండటం గమనార్హం.

మరోవైపు, భారత్‌లో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ (Omicron) సబ్- వేరియయంట్ XBB.1.16 కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ వేరియంట్ BA.2.10.1 & BA.2.75 పునఃసంయోగం, దాని మాతృక XBBతో పోలిస్తే SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్ (E180V, F486P & K478R)లో మూడు అదనపు ఉత్పరివర్తనలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.