యాప్నగరం

భారత్ ఉన్నత విద్యకు కేంద్రం కాబోతుంది, ఈ దశాబ్దం మనదే: మోదీ

India higher education: ఉన్నత విద్యకు ఇండియా అంతర్జాతీయ హబ్‌గా మారబోతుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశం అన్ని రంగాల్లో దూసుకెళుతోందని అన్నారు. మైసూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.

Samayam Telugu 19 Oct 2020, 10:48 pm
దశాబ్దం భారతీయ యువతకు అపారమైన అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని తెలిపారు. అందుకు అవసరమైన మార్పులు చేపడుతున్నట్లు చెప్పారు. ఉన్నత విద్యకు భారత్‌ను అంతర్జాతీయ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం (అక్టోబర్ 19) మైసూరు విశ్వవిద్యాలయం పట్టా ప్రదాన కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు.
Samayam Telugu ప్రధాని మోదీ
Efforts are made to make India a global hub for higher education: PM Modi


ఈ దశాబ్దాన్ని భారత దశాబ్దంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని రంగాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా సంస్కరణలు ఊపందుకున్నాయని తెలిపారు. వ్యవసాయం మొదలుకొని అంతరిక్షం, రక్షణ, వైమానిక రంగాల్లో గత ఆరు నెలలుగా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని మోదీ చెప్పారు.

‘గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అది ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమయ్యేది. ఇతర రంగాలను పక్కన పెట్టేవారు. కానీ, గత 6 నెలలుగా అన్ని రంగాల్లో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది’ అని మోదీ పేర్కొన్నారు.

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (NEP) విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నైపుణ్యాలపైనే దృష్టి సారించి యువతను అన్ని రంగాల్లో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు ఈ విధానం తోడ్పడుతుందని ఆయన అన్నారు.

వ్యవసాయ రంగంలోనూ కొన్ని మార్పులు చేస్తూ వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. అవి రైతుల సాధికారత కోసం దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రైతులనే కాకుండా వ్యవసాయ కూలీలను కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరిస్తాయన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని మోదీ తెలిపారు.

Also Read: కరోనా పీక్ దశ వెళ్లిపోయింది.. ఫిబ్రవరి నాటికి అంతం

Don't Miss: అమ్మాయిల పెళ్లి వయసు పెంపు.. త్వరలోనే నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.