యాప్నగరం

Indian Flag: లండన్‌లో ఖలీస్థానీ మద్దతురాలకు కౌంటర్.. భారీ త్రివర్ణ పతాకం ఎగురవేసిన భారత్ హైకమిషన్.. వీడియో

పంజాబ్ పోలీసులు.. ఖలీస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను వ్యతిరేకిస్తూ లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు ఆందోళన చేశారు. భారత హైకమిషనర్ కార్యాలయం ముందు ఆదివారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా కమిషన్ భవనంపైనున్న త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచారు. జాతీయ జెండాను కిందికి దించారు. ఇదంతా జరుగుతుంటే అడ్డుకోవడానికి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేరు. ఈ ఘటనపై భారత హైకమిషన్ వేగంగా స్పందించింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 20 Mar 2023, 1:04 pm

ప్రధానాంశాలు:

  • లండన్‌లో ఖలీస్థాన్ మద్దతుదారుల నిరసన
  • జాతీయ జెండాను కించపరిచని ఆందోళనకారులు
  • ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Indian Flag
ఖలిస్థానీ సానుభూతిపరుడు (Khalistan), ‘వారిస్‌ పంజాబ్‌ దే’ (Waris Punjab De) నేత అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అమృత్‌పాల్‌ కోసం పోలీసుల గాలింపును నిరసిస్తూ అతడి మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో లండన్‌ (London)లోని భారత హైకమిషన్‌ కార్యాలయం (Indian High Commission ) వద్ద ఖలిస్థాన్‌ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో భారత జాతీయ జెండాను ఖలిస్థానీ మద్దతుదారులు కించపరిచారు. హైకమిషన్‌ భవనంపై ఎగురవేసిన త్రివర్ణ పతాకాన్ని కిందికి దింపివేశారు.
త్రివర్ణ పతాకాన్ని కిందికి దింపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా... ఈ సంఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. హైకమిషన్ కార్యాలయంపై భారీ త్రివర్ణ పతాకాన్ని తాజాగా ఎగురవేసింది. దీంతో ఖలిస్థానీ మద్దతుదారులకు భారత హైకమిషన్ చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకున్నట్టయ్యింది. భారత పతాకాన్ని అగౌరవ పరిచిన చోటే భారీ పతాకాన్ని ఏర్పాటు చేసింది. సంఘటన జరిగిన 24 గంటల్లోనే హై కమిషన్ బిల్డింగ్ పై భారీ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ వీడియోను హైకమిషన్ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

అటు, ఢిల్లీలోని యూకే సీనియర్‌ దౌత్యవేత్త క్రిస్టినా స్కాట్‌కు ఆదివారం సమన్లు జారీ చేసిన భారత ప్రభుత్వం.. లండన్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నిరసన తెలిపింది. దీనికి బాధ్యులైనవారిపై యూకే ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ చర్యను తీవ్రమైందని, అక్కడకు నిరసనకారులు వచ్చేంతవరకూ భారత హైకమిషన్‌ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీసింది.

ఈ ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది. వియన్నా ఒప్పందం ప్రకారం భారత హైకమిషన్‌కు భద్రత కల్పించడం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని భారత విదేశాంగశాఖ ఈ సందర్భంగా గుర్తు చేసింది. కాగా, ఈ చర్యలపై యూకే కామన్వెల్త్ దేశాల అభివృద్ధి వ్యవహారాల మంత్రి లార్డ్ తారిఖ్ అహ్మద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘‘లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఈ రోజు జరిగిన దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది.. భారత్ మిషన్, దాని సిబ్బంది సమగ్రతకు వ్యతిరేకంగా జరిగిన ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు... భారత హైకమిషన్ భద్రతను యూకే ప్రభుత్వం ఎల్లప్పుడూ సీరియస్‌గా తీసుకుంటుంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పోలీసులు మూడు రోజులుగా గాలిస్తున్నారు. పంజాబ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.