యాప్నగరం

సంక్షేమ పథకాలతో చిరస్థాయిగా నిలిచిపోయే ‘అమ్మ’

తమిళనాట వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం అనేది దాదాపుగా అసాధ్యం. అలాంటిది జయలలిత దాన్ని సాధ్యం చేసి చూపారు. ఇందుకు కారణం ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే.

Samayam Telugu 6 Dec 2016, 10:42 am
జయలలితకు తమిళనాట విశేష ప్రజాదరణ ఉంది. దీనికి కారణం ఆమె చేపట్టిన సంక్షేమ పథకాలే. తమిళనాడు ఎన్నికల్లో ప్రజాకర్షక పథకాలే విజేతల్ని నిర్ణయిస్తాయి. 2006 ఎన్నికల్లో ఇంటికో కలర్ టీవీ ఇస్తానంటూ హమీ ఇచ్చిన కరుణానిధి అధికారంలోకి వచ్చారు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఉచిత హామీల హవా సాగుతోంది. 2011లో అధికారంలోకి వచ్చిన జయలలిత గతేడాది జరిగిన ఎన్నికల్లోనూ తిరిగి సీఎం కుర్చీ ఎక్కడానికి ఆమె ప్రవేశపెట్టిన పథకాలే కారణమంటే అతిశయోక్తి కాదు. అమ్మ పేరిట ఉప్పు, నీరు, ఐదు రూపాయలకే భోజనం పెట్టే క్యాంటీన్లు, సిమెంట్, పప్పు.. ఇలా రకరకాల పథకాలను ఆమె ప్రవేశపెట్టారు.
Samayam Telugu jayalalilthaa the mother of welfare schemes
సంక్షేమ పథకాలతో చిరస్థాయిగా నిలిచిపోయే ‘అమ్మ’


2013లో ఆమె ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లు పేదల పాలిట కల్పవృక్షాలయ్యాయి. ఈ పథకం ఆమెకు సంతృప్తిని ఇవ్వడంతోపాటు దేశవ్యాప్తంగా జయకు పేరు తెచ్చింది. అదే ఊపులో అమ్మ ఉప్పు, అమ్మ మంచినీరు, అమ్మ సిమెంట్ ఇలా అమ్మ పేరుతో పలు రకాల పథకాలను జయ ప్రవేశపెట్టారు. అమ్మ ఫోన్లు, నవజాత శిశువుల కోసం అమ్మ కిట్లను కూడా అందజేశారు. ప్రజలకు త్వరగా సేవలు అందేందుకు అమ్మ సేవాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉచితంగానే ప్రజలకు ధ్రువపత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అందుకే వరుసగా రెండోసారి ఆమె అధికారంలోకి వచ్చారు.

రెండోసారి అధికారం కట్టబెట్టిన ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయాలని జయలలిత తపించారు. అందుకే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అమ్మ కల్యాణ మండపాలను నిర్మించి తక్కువ ధరకే పేదల వివాహాది శుభకార్యాలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో 6 నెలలుగా ఉన్న మెటర్నిటీ లీవ్‌లను 9 నెలలకు పొడిగించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించారు. పేద యువతుల వివాహాల కోసం ఒక్కొక్కరికి ఎనిమిది గ్రాముల బరువుండే బంగారు నాణేలను పంచారు. కావేరీ జలాలను రాష్ట్రానికి తీసుకురావడానికి, తమిళ జాలర్లను ప్రయోజనాల కోసం ఆమె కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. జీఎస్టీని వ్యతిరేకించారు. ఇంతకూ అమ్మ అంటే జయలలిత కాదు.. అష్యూర్డ్‌ మ్యాక్సిమమ్‌ సర్వీస్‌ టు ది మార్జినల్‌ పీపుల్‌ ఇన్‌ ఆల్‌ విలేజెస్‌ -ఏఎంఎంఏ. మూడేళ్ల క్రితం ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ‘అమ్మ’ను ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.