యాప్నగరం

మద్యం మత్తులో ఐఏఎస్‌ ఆఫీసర్ బీభత్సం.. జర్నలిస్టు దుర్మరణం

Kerala | ఓ ఐఏఎస్ అధికారి తన బాధ్యత మరిచి ప్రవర్తించారు. ఫూటుగా మద్యం తాగి కారు నడిపి ఓ జర్నలిస్టు ప్రాణాలు బలిగొన్నారు. కేరళలోని త్రివేండ్రంలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 3 Aug 2019, 5:17 pm
ఐఏఎస్‌ అధికారి తన బాధ్యత మరిచి, అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు. మితిమీరిన వేగంతో కారుతో బైక్‌ను ఢీకొట్టడంతో సీనియర్ జర్నలిస్టు దుర్మరణం పాలయ్యాడు. ఘటన జరిగిన సమయంలో ఐఏఎస్‌తో పాటు కారులో మరో మహిళ కూడా ఉంది. కేరళలోని త్రివేండ్రంలో శనివారం (ఆగస్టు 3) వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఐఏఎస్ అధికారి శ్రీరామ్‌ వెంకటరామన్‌‌గా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu IAS
ఐఏఎస్ అధికారి కారు బీభత్సం


మలయాళంలో గుర్తింపు పొందిన పత్రిక ‘సిరాజ్‌’లో బ్యూరో ఛీఫ్‌‌గా పనిచేస్తున్న జర్నలిస్టు మహమ్మద్‌ బషీర్‌ (35) తన కార్యాలయంలో సమావేశం ముగించుకొని శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నారు. త్రివేండ్రం మ్యూజియం వద్ద అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు బైక్‌ 100 మీ దూరం ఎగిరిపడింది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ సీట్లో ఐఏఎస్ అధికారి శ్రీరామ్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆయన తప్పతాగి వాహనం నడుపుతున్నట్లు తేల్చారు. ప్రమాద సమయంలో కారులో శ్రీరామ్‌తో పాటు వాఫా అఫ్జా అనే మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రమాదానికి కారణమైన కారు సదరు మహళ వాఫా అఫ్జా పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. తాను కారు నడపలేదని, తన స్నేహితురాలే నడిపారని పోలీసులతో ఐఏఎస్‌ శ్రీరామ్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు ఆటో డ్రైవర్లు దీనికి భిన్నంగా చెప్పారు. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి పోలీసులు ఐఏఎస్ శ్రీరామ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

ప్రమాదంలో ఐఏఎస్ శ్రీరామ్ వెంకటరామన్‌తో పాటు ఆయనతో ఉన్న మహిళలకు కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వెంకటరామన్‌ మోతాదుకి మించి ఆల్కహాల్ తీసుకున్నట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. జర్నలిస్టు బషీర్‌ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.