యాప్నగరం

సమాజం చేయూతనివ్వగా.. ఘనంగా వరద బాధితురాలి పెళ్లి

వరదల కారణంగా.. సర్వస్వం కోల్పోయిన ఓ యువతి కుటుంబానికి సమాజం అండగా నిలిచింది. దీంతో ఆగిపోయిందనుకున్న పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

Samayam Telugu 27 Aug 2018, 12:19 pm
మడికెరి: కేరళ, కర్ణాటకలను ముంచెత్తిన వరదలు.. భారీ నష్టాన్ని మిగిల్చినా.. మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపాయి. వరదల కారణంగా.. సర్వస్వం కోల్పోయిన ఓ యువతి కుటుంబానికి సమాజం అండగా నిలిచింది. దీంతో ఆగిపోయిందనుకున్న పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. గుళ్లో పెళ్లి జరగ్గా.. పునరావాస కేంద్రంలో తల దాచుకుంటున్న తోటి బాధితులే పెళ్లి పెద్దలై ఆశీర్వదించారు. ఈ ఘటన కర్ణాటకలోని మడికెరిలో చోటు చేసుకుంది.
Samayam Telugu marriage-madikeri


వివరాల్లోకి వెళ్తే.. మక్కందూర్ గ్రామానికి చెందిన మంజులకు కేరళలోని కన్నూరుకు చెందిన రజీష్‌తో ఆగష్టు 26న పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ భారీ వరదలు, కొండ చరియలు విరిగి పడటంతో.. ఆమె కుటుంబం కట్టుబట్టలతో పునరావాస కేంద్రంలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పెళ్లి మీద ఆశలు వదిలేసుకుంది. ఈ విషయం మీడియాలో ప్రచారం కావడంతో.. సాయం చేయడానికి పలువురు ముందుకొచ్చారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి జమీర్ అహ్మద్ మంజుల పెళ్లి కోసం తన వంతుగా రూ.50 వేలు విరాళం ఇచ్చారు. ఓ మహిళా వలంటీర్ రూ.25 వేలు సాయం అందించింది. మడికెరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రూ.50 వేలు ఇస్తానని మాటిచ్చారు. ఇలా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేశారు. దీంతో ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే మడికెరిలోని ఓంకారేశ్వర ఆలయంలో రజీష్‌తో మంజుల పెళ్లి జరిగింది.

వరదల కారణంగా మంజుల కుటుంబం పెళ్లి మీద ఆశలు వదిలేసుకుంది. అలాంటిది ఇంత ఘనంగా వివాహం జరగడం, ఊహించని స్థాయిలో జనం రావడంతో.. వారు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఇంత గొప్పగా తన కూతురి పెళ్లి జరుగుతుందని కలలోనైనా అనుకోలేదని ఆమె తల్లి ఆనంద భాష్పాలు రాల్చారు. మంజులకు మూడు నెలల వయసులోనే తండ్రిని కోల్పోగా.. తల్లే పెంచి పెద్ద చేసింది. ఆమె అన్నయ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లి కొడుకు తండ్రి కూడా కొన్నాళ్ల కిందట చనిపోయాడు. అతడి సోదరి మాత్రమే పెళ్లికి హాజరు కాగా.. వరదల కారణంగా అతడి తల్లి రాలేకపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.