యాప్నగరం

ప్రజలపై వరాల జల్లు కురిపించిన కర్ణాటక కొత్త సీఎం.. మోదీకి థ్యాంక్స్

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే బసవరాజ్‌ బొమ్మై రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రైతు కుటుంబాల పిల్లలకు రూ.1000కోట్లతో ఉపకారవేతనాలు చెల్లించనున్నట్టు ప్రకటించారు.

Samayam Telugu 28 Jul 2021, 8:30 pm
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే ఆయన రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రజలతో చక్కటి మైత్రీసంబంధాలు నెరుపుతూ, ప్రజానుకూల కార్యక్రమాలు చేపట్టిన బీఎస్ యడియూరప్ప బాటలోనే తానూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటానని తెలిపారు.
Samayam Telugu bommai


పదవీ బాధ్యతలు చేపట్టగానే కేబినెట్‌, అధికారులతో సమావేశమైన బొమ్మై... వరదలు, కోవిడ్ మేనేజిమెంట్‌కే తాను ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. రైతుల పిల్లల కోసం రూ.1000 కోట్లతో స్కాలర్‌షిప్ స్కీమ్ తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. సంధ్యా సురక్ష పథకం కింద వృద్ధాప్య పెన్షన్లను రూ.1000 నుంచి రూ.1200కు పెంచనున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.863.52 కోట్ల అదనపు భారం పడినా.. 35.98 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కోవిడ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వనరుల సక్రమ వినియోగం, ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామని స్పష్టం చేశారు.

కర్ణాటక కొత్త కొత్త సీఎంగా బొమ్మై ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. తనపై విశ్వాసం ఉంచిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో సుపరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా అందిస్తానని పేర్కొన్నారు. భారత్‌ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాలన్న మోదీ విజన్‌ను కర్ణాటకలో సాకారం చేసేందుకు తన వంతు కృషిచేస్తానని బొమ్మై స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.