యాప్నగరం

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్: అమరుడైన ఓ జవాన్, ఇద్దరు ముష్కరులు హతం

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో తీవ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాల సమాచారం మేరకు ఆ ప్రదేశంలో మంగళవారం తెల్లవారుజామున సైన్యం తనిఖీలు చేపట్టింది.

Samayam Telugu 27 Nov 2018, 10:19 am
కశ్మీర్‌లో ఉగ్రవాదులపై సైన్యం ఉక్కుపాదం మోపుతూ, వారి ఏరివేత చర్యలను మరింత ముమ్మరం చేసింది. తాజాగా, దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో తీవ్రవాదులు చొరబడినట్టు నిఘా వర్గాల సమాచారం మేరకు ఆ ప్రదేశంలో మంగళవారం తెల్లవారుజామున సైన్యం తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో భదత్రా దళాలు అప్రమత్తమయ్యాయి. దీంతో, ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ జవాన్ అమరుడు కాగా, ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. ఐదు గంటలపాటు సాగిన ఆపరేషన్ అనంతరం తీవ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, పుల్వామాలోని త్రాల్ పట్టణంలో మరో రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. త్రాల్ సమీపంలోని ఓ గ్రామంలోని ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్టు అధికారులు తెలిపారు.
Samayam Telugu kulgam


రెండు రోజుల కిందట సోఫియాన్ జిల్లాలో ఏడుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. కప్రాన్ బటాన్‌గుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో ఆదివారం ఉదయం జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా తనిఖీలు చేపట్టి వారిని హతమార్చారు. గత వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 20 మంది వరకు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఈ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు జవాన్లు సైతం నేలకొరిగారు. శుక్రవారం అనంత్‌నాగ్ జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చి, వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.