యాప్నగరం

కేరళ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులు పెళ్లి తర్వాత వెంటనే ఆ పని చేయాల్సిందే

కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వంలో పని చేస్తున్న వివాహం కాని పురుష ఉద్యోగులు తాము వరకట్నాన్ని ప్రొత్సహించడం లేదా తీసుకోకూడదని స్పష్టం చేసింది.

Samayam Telugu 26 Jul 2021, 6:45 pm
సమాజాన్ని పట్టిపీడిస్తున్న వరకట్న సమస్యకు వ్యతిరేకంగా కేరళ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న అవివాహితులు వరకట్నం తీసుకోవడం గానీ, ప్రోత్సహించడం గానీ చేయకూడదని నిబంధన తీసుకొచ్చింది. అంతేకాకుండా పెళ్లయిన నెల రోజుల్లో తాము పని చేస్తున్న విభాగం అధిపతులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ డిక్లరేషన్‌లో భార్య సంతకంతో పాటు వధూవరుల తండ్రుల సంతకాలు ఉండాలని పేర్కొంది.
Samayam Telugu సీఎం పినరయి విజయన్


కేరళ మహిళ, శిశు సంక్షేమ శాఖ కొద్దిరోజుల క్రితమే ఈ సర్క్యులర్ జారీ చేసినప్పటికీ సోమవారమే దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్, అటానమస్, ఇతర సంస్థలకు సంబంధించిన విభాగాల అధిపతులు ఉద్యోగుల నుంచి ఈ మేరకు డిక్లరేషన్లు తీసుకోవాలని కేరళ సర్కార్ స్పష్టం చేసింది.

దీంతో కేరళలో ఏటా నవంబర్ 26వ తేదీని వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కట్నం తీసుకోమని ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది. వరకట్నానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ తమ డిగ్రీ తీసుకోవడానికి ముందు బాండ్ రాసివ్వాలని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ గత నెలలో సూచించిన సంగతి తెలిసిందే. కేరళ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.