యాప్నగరం

లవ్ జిహాద్ చట్టం: యూపీలో తొలి కేసు.. పరారీలో నిందితుడు

పెళ్లి పేరుతో బలవంతపు మతమార్పిడికి పాల్పడుతున్న ఘటనలకు అడ్డుకట్టవేయడానికి యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇటీవల చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Samayam Telugu 29 Nov 2020, 1:22 pm
బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు ఉత్తర్ ప్రదేశ్‌ ప్రభుత్వం మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్- 2020 పేరుతో చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం తెలపడంతో శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కింద బరేలీ జిల్లా డియోరానియా పోలీస్ స్టేషన్‌లో తొలికేసు నమోదైంది. యువతిని మత మారమని బలవంతం చేశాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Samayam Telugu యూపీ లవ్ జిహాద్ చట్టం
Love Jihad Act


ఇతర మతానికి చెందిన నిందితుడు (22) యువతిని వివాహం చేసుకుని ఆమెను మతం మారాలని బలవంతం చేసినట్టు ఫిర్యాదు అందింది. దీనికి యువతి అంగీకరించకపోవడంతో తరుచూ ఆమె ఇంటికొచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. తను చెప్పినట్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు బాధితులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

ఫిర్యాదు అధారంగా నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై అదనపు ఎస్పీ సన్సార్ సింగ్ మాట్లాడుతూ.. ‘డియోరానియాలోని షరీఫ్‌నగర్‌కు చెందిన యువకుడు యువైష్ అహ్మద్.. బాధిత యువతిని వివాహం చేసుకున్నాడు.. ఆమెను మతం మారి, తనతో కాపురం చేయాలని బలవంతం చేశాడు’ అని అన్నారు.

ఈ చట్టం కంప్యూటర్ డేటాబేస్‌లో ఇంకా నిక్షిప్తం కానందున, మ్యానువల్‌గా చేర్చాం... నిందితుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు... అతడిని పట్టుకోవడానికి బృందాలను నియమించాం.. ఫిర్యాదుదారుడి ఇంటి వద్ద కూడా భద్రతను ఏర్పాటుచేశాం’ అని పేర్కొన్నారు.

యూపీ తాజా చట్టం ప్రకారం.. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఇతర పౌరులను చట్ట విరుద్ధంగా మతం మారాలంటూ ఒత్తిడి తెచ్చే వారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు. అమ్మాయిలను ప్రేమలో పడేసి వారిని మతం మార్చుతోన్న ఘటనలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో యూపీతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.