యాప్నగరం

ప్రయాణికులకు చుక్కలు చూపించిన లక్నో మెట్రో!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెట్రో రైలు సేవలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

TNN 6 Sep 2017, 12:39 pm
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెట్రో రైలు సేవలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలకు బుధవారం నుంచి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే తొలి రోజే లక్నో మెట్రో రైలు ప్రయాణికులకు చుక్కలు చూపించింది. బుధవారం ఉదయం మార్గం మధ్యలో సాంకేతిక కారణలతో మెట్రో రైలు నిలిచిపోవడంతో సుమారు 500 మంది ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. సుమారు గంటపాటు రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏసీ పనిచేయకపోవడం, రైలులోని లైట్లన్నీ ఆగిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు.
Samayam Telugu lucknow metro comes to a halt on the first day of public launch
ప్రయాణికులకు చుక్కలు చూపించిన లక్నో మెట్రో!


సమాచారం అందుకున్న లక్నో మెట్రో రైల్ కార్పోరేషన్ (ఎల్ఎంఆర్సీ) అధికారులు సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర ద్వారాలను తెరిచి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. వీరిలో చాలా మంది ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ఉండగా.. కొంత మంది తొలిసారి మెట్రో అనుభూతిని పొందడానికి ఎక్కినవారే. అయితే రైలు ఆగిపోవడం వల్ల ఫ్లైట్ మిస్సయిన చాలా మంది ఎల్ఎంఆర్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా సమయం కలిసొస్తుందని మెట్రో రైలు ఎక్కుతామని, కానీ ఇప్పుడు తమ సమయాన్నంతా తినేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికన్నా రిక్షా ఎక్కి ఉంటే ఎయిర్‌పోర్టుకు ఎప్పుడే వెళ్లిపోయుండేవారి మని ఎద్దేవా చేశారు.

కాగా, మెట్రో రైలు బ్రిడ్జిపై దించిన ప్రయాణికులను మరో రైలులో గమ్య స్థానాలకు పంపించారు. రైలు ఆగిపోయిన పట్టాలకు పక్కన సమాంతరంగా ఉన్న పట్టాలపై ప్రస్తుతం రైళ్లను నడుపుతున్నారు. ఇదిలా ఉండగా.. లక్నోలో తొలిదశ మెట్రోరైలు సేవలను మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.