యాప్నగరం

ప్రచారం చేసే ప్రసక్తే లేదు: వెంకయ్య

ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం రాష్ట్రాల్లో ప్రచారం చేసే ప్రసక్తే లేదని ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

TNN 18 Jul 2017, 12:40 pm
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం రాష్ట్రాల్లో ప్రచారం చేసే ప్రసక్తే లేదని ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఎంతో మంది ఉన్నతమైన వ్యక్తులు అధిరోహించిన స్థానానికి మరింత గౌరవం తెచ్చేలా నడుచుకుంటానని చెప్పారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. తొలి సెట్‌పై ప్రధాని మోదీ సంతకం చేయగా.. రెండో సెట్‌పై రాజ్‌నాథ్‌‌సింగ్‌ సంతకం చేశారు. నామినేషన్ దాఖలు అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu m venkaiah naidu files nomination
ప్రచారం చేసే ప్రసక్తే లేదు: వెంకయ్య


‘ఈ రోజు నుంచి నా పాత్ర మారిపోతుంది. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ఇప్పుడు విభిన్న పాత్ర పోషించబోతున్నాను. నా పాత్రకు న్యాయం చేస్తాననే అనుకుంటున్నాను’ అని చెప్పారు. తాను సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, పార్టీ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు. ‘ఏడాదిన్నర వయసులో తల్లిని కోల్పోయాను. పార్టీనే తల్లిగా భావిస్తూ జీవితం గడిపాను. ఇప్పుడు పార్టీని వీడాల్సిన పరిస్థితి. తల్లిలాంటి పార్టీని వీడేటప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. నాకు మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు’ అని అన్నారు.

కాగా, వెంకయ్య నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా పలువురు ఎంపీలు, భాజపా ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆగస్టు 5న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలో యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీతో వెంకయ్యనాయుడు తలపడనున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వెంకయ్యనాయుడు తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం ఆయన భాజపా అగ్రనేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
Took the blessings of Sh Murli Manohar Joshi ji. pic.twitter.com/dophj6jD7m — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) July 18, 2017 Took the blessings of Sh LK Advani ji. pic.twitter.com/cXNdIdXYdY — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) July 18, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.