యాప్నగరం

కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ 2.0: రెబల్స్ ఏకతాటిపై నిలబడటం వెనుక ఆయన వ్యూహం!

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. రాజీనామా లేఖలు నిర్ణీత నమూనాలో సమర్పించిన ముగ్గురు అసమ్మతి ఎమ్మెల్యేలు తనను కలిసేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు.

Samayam Telugu 12 Jul 2019, 12:54 pm
దాదాపు రెండు వారాల కింద మొదలైన కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ రమేశ్ కుమార్‌ను రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కలవనున్నారు. అయితే, స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ముగ్గురికి స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే ఉత్కంఠ నెలకుంది. మరోవైపు, నేటి నుంచే వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇక, బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ 2.0లో ముంబై నగరం కీలక పాత్ర పోషిస్తోంది. రాజీనామా చేసిన కాంగ్రెస్-జేడీఎస్ రెబల్స్‌‌కు ఇక్కడ ఆశ్రయం ఇవ్వడమే కాదు, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ కదలికలను నిశితంగా గమనిస్తూ వ్యూహా రచన చేస్తున్నారు. సోఫిటెల్‌ హోటల్‌లో మకాం వేసిన ఎమ్మెల్యేలను కలవడానికి కాంగ్రెస్-జేడీఎస్ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని, వారిని ఏకతాటిపైకి తీసుకురావడం వెనుక మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
Samayam Telugu prasad-lad


దీంతో అసంతృప్తి ఎమ్మెల్యేలను కలవడానికి ముంబై వచ్చిన డీకే శివకుమార్ నిరాశతో వెనుదిరిగారు. రెబల్స్‌ను కలవకుండా ప్రసాద్ లాడ్ మధ్యలో అడ్డుగోడగా నిలబడ్డారు. ఆపరేషన్ కమల 2.0కి సరైన వ్యక్తి కోసం అన్వేషించిన బీజేపీ, దీనికి ప్రసాద్ లాడ్ సమర్ధుడిగా భావించింది. అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతలను లాడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, రెబల్స్ చేజారిపోకుండా వ్యూహరచన చేశారు. నాలుగేళ్ల కిందట నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ప్రసాద్ లాడ్, తక్కువ కాలంలో అధిష్ఠానం విశ్వాసాన్ని చూరుగొన్నారు. దేశంలోనే అతిపెద్ద సెక్యూరిటీ ఏజెన్సీ క్రైస్టల్‌ అధినేత లాడ్. గత మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు ఎమ్మెల్యే టిక్కెట్‌కు ప్రయత్నించి భంగపడ్డారు. దీంతో ఎన్సీపీ రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చారు. కర్ణాటకలో ఆపరేషన్ కమలకు మహారాష్ట్ర బీజేపీ నేత బాధ్యత వహించడం ఇది రెండో సారి.

గతేడాది శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, తగినంత మెజార్టీ లేకపోవడంతో అవసరమైన సంఖ్యా బలం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేసినా పాచిక పారలేదు. ఈ బాధ్యతలు ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షేలార్‌కు అప్పగించినా, నిరాశ తప్పలేదు. అయితే, ప్రస్తుతం ప్రసాద్ లాడ్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, క్లిష్ట సమయంలో తన చతురతను ప్రదర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ముంబై నుంచి బెంగళూరుకు రెబల్ ఎమ్మెల్యేలందరినీ ఒకే గ్రూప్‌గా పంపడంలో లాడ్ వ్యూహం ఉంది. తొలుత ముగ్గురు నలుగురు చొప్పున ఎమ్మెల్యేలు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లాడ్ మాత్రం అందరూ ఒకేసారి వెళితే సత్తా ఏంటో తెలుస్తుందని సలహా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.