యాప్నగరం

లాక్‌డౌన్ పొడిగింపునకు మహారాష్ట్ర సీఎం మొగ్గు.. సంకేతాలు

దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకుంటున్నాయి. ముంబయి నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య 30వేలు దాటిపోయింది.

Samayam Telugu 30 May 2020, 11:49 am
ఆదివారంతో దేశవ్యాప్త లాక్‌డౌన్ 4.0 ముగియనుండగా.. దీనిని కొనసాగిస్తారా? ముగిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించడానికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మొగ్గుచూపుతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా ముంబై, పుణే లాంటి కరోనా హాట్‌స్పాట్స్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలుచేసి, మిగతా చోట్ల ఆంక్షలను సడలించాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే 15 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కళ్లూ అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ సూచించారు.
Samayam Telugu మహారాష్ట్రలో లాక్‌డౌన్


మే 31 తర్వాత చేపట్టే చర్యల గురించి కేంద్రం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత కొత్తగా నిబంధనలు, ఆంక్షల సడలింపుపై మార్గదర్శకాలను రూపొందిస్తామని ఆయన తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నా వైరస్ నియంత్రణలోనే ఉందని, మరణాల రేటు కూడా రాష్ట్రంలో తగ్గిందన్నారు. కానీ ఈ సమయంలో ఉదాసీనత పనికి రాదని అన్నారు. ముంబై, పుణేలో వైరస్ విజృంభణ కీలక దశకు చేరిందని, ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు.

వైరస్‌ను కట్టడిచేసిన చైనా, కేరళలో మళ్లీ మహమ్మారి రెండో దశలో విజృంభిస్తోందని, ప్రస్తుతం ఉన్న ఆంక్షలను సడలిస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురువుతుంది.. మనకు అలాంటి పరిస్థితి ఉందా? అది ఎంత బలంగా ఉంటుంది అనేది ఒక ప్రశ్న అని అన్నారు. జూన్‌లో వర్షాలు ప్రారంభమైన తర్వాత కరోనావైరస్, సీజనల్ వ్యాధులతో కలిసి విజృంభిస్తుందా అనే ప్రశ్నకు ఠాక్రే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ రోజుల్లో ఎవరు ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు అని అన్నారు. వర్షాకాలంలో పరిపాలనా యంత్రాంగానికి మరింత భారం పడకుండా అందరూ జాగ్రత్త వహించాలని తెలిపారు.

వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవడం గురించి చాలా చర్చలు జరిగాయని, అయితే దీన్ని ఎలా చేయాలో స్పష్టం చేయాల్సి ఉందని, ఈ విషయంలో అవగాహన తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ కేసుల సంఖ్య 62వేలు దాటింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.